పుట:2015.373190.Athma-Charitramu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. గోపాలపురము 7

రును లేరు. పాప మెంతో భయభక్తులతో బగ లెల్ల పరిచర్యలు చేసి యలసిన యాబాలికను, ఏదో మిష పెట్టి తండ్రి రాత్రులు మోదు చుండును ! అంత వినువారి గుండె లవియునట్టుగ బాలిక రోదనము చేయుచుండును. లోక మనఁగ నిట్టి విపరీతవైషమ్యములతో నిండి యుండునట్టిదియే కాఁబోలని తలపోసి, రాత్రి పానుపు చేరి, నా విస్మయ విషాదములను గాఢసుషుప్తియందు విస్మరించుచుండువాఁడను !

అచ్చటినుండి మా తండ్రి నరేంద్రపురమునకు మార్పఁబడెను. మే మక్కడకుఁ బోయిన కొలఁదిదినములకే జరిగిన యొక యుత్సవ సందర్భమున నచటివారును పొరుగూళ్ల వారును "ప్రభలు" గట్టి రాత్రి యూరేగించిరి. ఆ యూరను చుట్టుప్రక్కలను ద్రావిడులు మెండుగ గలరు.

అచ్చట నొకచావడిలో జరుగు పాఠశాలలో నేను జేరి, మూఁడవపాఠపుస్తకము చేతఁ బట్టితిని. ఆ పుస్తకమందలి "శ్రీరామ పట్టాభిషేకవర్ణనము" మిగుల మనోహరముగ నుండెను. నా సహచరులలో సూర్యచంద్రు లను నిరువురు సోదరులు గలరు. చంద్రుఁడు తను కాంతితో విలసిల్లెడి సుందరాకారుఁడె కాని, సూర్యునిమోము కాల మేఘము లావరించిన సూర్యబింబమె ! వారు నివసించు నింటి యజమానునికి కురూపి యగు నేకపుత్రుఁడు కలఁడు. ఆ యువకుని సతి యన్ననో చక్కనిచుక్క. మగనిచెంత మసలెడి యా మగువ, కాఱు మబ్బునడుమ తళుకొత్తు మెఱఁపుఁదీఁగయె ! ఇట్టి విపర్యయముల కాశ్చర్యపడియెడి నా కప్పటి కాఱుసంవత్సరములు పూర్తి గాకుండెను.

1877 వ సంవత్సరపు వేసవిని నా రెండవ తమ్ముఁడు కృష్ణమూర్తి మా యిరువురివలెనే వేలివెన్నులో జననమయ్యెను. మే మంతట గోపాలపురము వెళ్లితిమి. అచట జరిగినసంగతులు నా మనో