పుట:2015.373190.Athma-Charitramu.pdf/431

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42. "హిందూ సుందరీమణులు" 393

బాగుగఁ బరీక్షించి, అం దేలోపము లేదనియు, కండర సంబంధమగు వాతమే బాధకుఁ గారణము కావచ్చు ననియును జెప్పిరి. నే నధికముగఁ బరిశ్రమము చేయుచు, నా వ్యాధిని గుఱించి పలుమాఱు తలపోయుచుండుటచేతనే నామంటలు హెచ్చుచుండవచ్చు నని కూడ వారి యభిప్రాయము !

42. "హిందూ సుందరీమణులు"(2)

1900 సం. సెప్టెంబరు మధ్యమున "హిందూ సుందరీమణుల చరిత్రముల" రెండవ భాగమును బూర్తిచేసితిని. దీనికిని మొదటిభాగమునకును గొంత భేదము లేకపోలేదు. కావున దీని పీఠికలో నే నిట్లు వ్రాసితిని : - "ఇందలి కథలలోఁ గొన్నింటిని గుఱించి యొకటిరెండు సంగతులు చెప్పవలసియున్నది. సత్యభామచరిత్ర నీ గ్రంథమున నేల చేర్చితి వని కొందఱు స్నేహితులు నన్నడిగిరి. సత్యభామ గయ్యాళి యనియు, ఆమెచరిత్ర మంతగా నీతిదాయకము గాదనియు వారల తలంపు. ఇది సరియైన యూహ కాదు. సీత, ద్రౌపది మొదలగు వనితల సుగుణములు శ్లాఘాపాత్రములే యైనను, వీరి చరిత్రములొకరీతినె ప్రాఁతవడిన గుణవర్ణనములతో నిండియుండి, నవీనుల కంతగా రుచింపకున్నవి. పతిభక్తియే వీరికిఁ గల గొప్పసుగుణము. ధైర్యసాహసాదు లంతగ వీరియందుఁ గానిపింపకున్నవి. ఇట్టిస్త్రీల చరిత్రములు చదివిచదివి, సత్యభామకథ చేతఁబట్టినవారి కింపగు భేదము గానఁబడును. నిర్మలప్రవర్తనమునం దితర ముదితలకు సత్య యావంతయుఁదీసిపోక, వారియందుఁ గానరాని ధైర్యాది నూతనసుగుణములు దాల్చి, హిందూవనితల యభ్యున్న తిని గాంక్షించెడివారల కానంద మొసంగుచున్నది ! మనదేశమందు