పుట:2015.373190.Athma-Charitramu.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 368

యంతకంటె నధమముగ నున్నది! ఈ యుభయదేవతలలోను మన్మథుఁడు మంచివాఁ డనిపించుకొనుచున్నాడు ! స్త్రీ పురుష హృదయ సమ్మేళనమే యాతనికిఁ బ్రీతికరము. వివాహాధిదేవత యన్ననో, ముఖ్యముగ మనదేశమున తగినంత కారణము లేకయే స్త్రీపురుషులకు నిర్బంధబాంధవ్య మేర్పఱుచుచున్నాడు ! ఈ కిరాతుని చేతలవలన పెక్కండ్రు స్త్రీ పురుషులు తమజీవితసౌఖ్యమును గోలుపోవు చున్నారు.

"సజ్జనుఁడగు నా మిత్రుఁడు 'సంస్కర్త' ను గూర్చి యిచటఁ గొంత ప్రస్తావించెదను. ఆయనయందు ప్రజ్ఞాసామర్థ్యములు విశేషముగ నున్నను, వానివలని మేలుమాత్రము కడు స్వల్పముగఁ గానవచ్చు చున్నది ! ఆయన విద్యావిశారదుఁడు సుగుణభూషితుఁడు నగు నవనాగరకుఁడైనను, వివాహమూలములగు వైషమ్యములవలన, ఆతని ప్రజ్ఞాలు క్రియాశూన్యములును, ఆశయములు నిష్ప్రయోజకములును నగుచున్నవి ! భావసంపదయు మహాశయభాగ్యమును గలవాఁడయ్యును, ఆతనివిలువ యెఱుంగక యాతనిసందేశములచొప్పున నడువ నొల్లని యొక యంగన కాతఁడు గట్టఁబడుట యెంతటి కాలవైపరీత్యము !

"తాను జెప్పినచొప్పున నాచరించుటయే పరమధర్మముగఁ జేసికొనినవాఁ డాపురుషుఁడు ! ఇదియే యాదంపతుల కలతలకుఁ గారణము. స్త్రీపురుషులకుఁ జిత్తవృత్తులందుఁ గొంత భేద మే కాలము నందును గాననగును. ప్రకృతమునం దాభేదము మిగుల నతిశయించి యున్నది. మోటుజాతులలో మగవానికి నాఁడుదానికి నెక్కువ యైకమత్య ముండును. ఇరువుర భావములు నాచరణములు నించు మించుగ నేక విధముననే సాగుచుండును. నాగరికత హెచ్చినకొలఁది