పుట:2015.373190.Athma-Charitramu.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36. "సతీయుత సంఘసంస్కారి" 369

పరిస్థితులలోను భావాదులలోను భేదము లేర్పడును. విద్యావంతుఁడగు పురుషుని యాశయములు విద్యాగంధ మెఱుఁగనిస్త్రీకి గొంతెమ్మ కోరికలవలెఁ గానిపించును ! శతాబ్దములనుండి స్త్రీవిద్యను నిరసించెడి యీ భారతదేశమున, స్త్రీపురుషులకుఁగల యీ యంతర మధికమై, ప్రకృతమందలి గృహకల్లోలములకుఁ గారణ మగుచున్నది.

"ఒడ్డుపొడుగులందు హనుమంతునికిని వాలఖిల్యులకును గలభేదము, బుద్ధివిషయమున "ఈ సంస్కర్త"కును అతని సతీమణికిని గలదు. గృహజీవితమునుగుఱించి యున్నతాశయములును, భార్యవిద్యాభ్యున్నతి విషయమై యుత్కృష్ట భావములును గల యీ'సంస్కర్త', జీవితమున పరాజయ మందెనే ! విద్యాధికులగు భారతీయులు పరిష్కరింపలేని సాంఘిక సమస్యల కై వారిని నిందింపఁదగదు. పురుషుఁడొక్కఁడే యీ పరాజయమునకుఁ గారణము గాఁడు. కుటుంబ విషయములలో నతనికి సర్వాధికారము లేదు. పశ్చిమదేశములలో భార్య యనఁగ సామాన్యముగ స్వయంవరయగు సుదతియె. అచ్చట వివాహబంధము భగ్న మైపోవుటకు భార్యాభర్త లిరువురలో తప్పక యొకరు ముఖ్యకారకు లని మనము గ్రహింపవచ్చును. భారతదేశమందట్లు కాదు. 'సంస్కారి' యాశయముల సద్భావము సంశయింప వలనుపడదు. కాని, యాతనిసతినిగూడఁ బూర్తిగ నిందింపనేరము. అజ్ఞానయై యటవీమృగమువలె నాయిల్లాలు పెరిఁగెను. అజ్ఞానయై నిరతము నడవియందే సంచరింప నామె వాంఛించుచున్నది ! ముఖ్యవిషయములం దాపొలఁతి పొరుగు ముసలమ్మలను గురువులఁగఁ జేకొని, భర్తకు ప్రాణసమానమగు నాశయముల నాశన మొనర్చి, అనుతాపలేశము లేక సంసారయాత్ర గడపుచున్న యది !"