పుట:2015.373190.Athma-Charitramu.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30. జనకసంస్మరణము 341

చునో యుండునట్లు మేము భ్రమపడుచుండువారము. మాకనుల కిం కెన్నఁడు కనఁబడక, ఆయన యొక్క పెట్టున మృత్యువునోటఁ బడినట్టుగ మేము విశ్వసింపఁజాలకుంటిమి!

మే మిపుడు చేయు కర్మాంతరములవలన నా కొకింత తాపోపశమనము గలుగుట వాస్తవమే. కాని, యా వ్యర్థకర్మకలాపమువలననే జనకుని పవిత్ర సంస్మరణమునకుఁ గొంత కొఱంతయుఁ గలుగుచున్నదని నే నెంతయు విసుగుచుండువాఁడను.

ఆదినములలో మా కెల్లరకును దుర్భరముగఁ దోఁచినది పదవనాఁటి మా జనని వపనకర్మయే. దీని కంగీకరింపవలదనియు, ఆక్షేపించువారలకు మేము తగు సమాధాన మిచ్చెద మనియు, మే మెంత బోధించినను మాతల్లి వినక, పూర్వాచారపరాయణయై యీ క్రూర కర్మ కొడంబడెను. ఆసమయమున దు:ఖావేశమున నామె మూర్ఛిల్లి పోవచ్చు నని మేము భీతిల్లినను, దైవానుగ్రహమున నట్లు జరుగలేదు. తనయులవలెఁ గాక, యాకష్టసమయమున మాతల్లి ధైర్యము వహించి యుండెను. విధ్యుక్త మని తాను నమ్మిన మార్గమెంత దుస్సహమైనను, దానిచొప్పుననడచుకొనుట కాపుణ్యవతి యావంతయుఁగొంకకుండెను.

మాతండ్రి చనిపోయిన 11 వ నాఁడు రాజమంద్రి "ప్రార్థనసమాజము"వారు ప్రత్యేకసభ నొకటి సమకూర్చిరి. ఆసమయమున రెబ్బాప్రగడ పాపయ్యగారు అధ్యక్షులుగ నుండిరి. మా జనకునిగూర్చి నే నపు డొక యాంగ్లవ్యాసమును జదివితిని. అందలి ముఖ్యభావము లిచటఁ జేర్చుచున్నాను: -

"చనిపోవునప్పటికి మాతండ్రికి సుమా రఱువది సంవత్సరముల వయస్సు. ఆయన జన్మస్థలము తణుకుతాలూకాలోని గోటేరు.