పుట:2015.373190.Athma-Charitramu.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 342

వారిది గౌరవనీయమగు నియోగిబ్రాహ్మణ కుటుంబము. విద్యాగంధ మెఱుంగని యాయన తండ్రి ప్రయాసమునఁ దనపెద్ద సంసారమును బోషించుకొనుచుండువాఁడు. ఆగ్రామమున నింటికిఁ జేరువనుండు తన పొలమును సొంతముగ సేద్యము చేసికొని, ఆయన సతీసుతులను బోషించుకొనుచుండువాఁడు. మాతాత కృష్ణమ్మగారి కైదుగురు పుత్రులును, ముగ్గురు పుత్రికలును గలరు. ఆయన కష్టములు నానాఁట ఫలించెను. కుమాళ్లు ఒక్కరొక్కరే పెద్దవారలు ప్రయోజకులునై, కుటుంబపోషణ భారమును తామే వహించిరి. చిన్నవాఁడు మా తండ్రికి విద్య నేర్చుటకు స్వస్థలమున నవకాశము లేకపోయెను. కాని, ఆయన యింట వ్యర్థకాలక్షేపము చేయనొల్లక స్వతంత్రజీవన సంపాద్యము చేయఁబూనెను. విద్య యంతగ రాకుండెడి యువకులకు జీవనోపాధి గలిపించుటకై యాకాలమున నరసాపురమున బోధనాభ్యసన పాఠశాల యొకటి యేర్పడియుండెను. మాతండ్రి యందుఁ జేరెను గాని, అచట బోధింపఁబడెడి చరిత్రము భూగోళము మున్నగు నూతన విషయములు తలకెక్కక, కొలఁది దినములకే యాయన యచటినుండి తప్పించుకొనిపోయెను ! అంత సర్వేశాఖలో నుద్యోగము సంపాదించి, పలుమాఱు పని విరమించుకొనుచు వచ్చినను, తన యుద్యోగకాల మంతయు నాయన, యా శాఖలోనే పనిచేసెను.

"సర్వేయుద్యోగమం దాయన యాంధ్రదేశ మంతటను సంచారము చేసెను. ఉత్తరజిల్లాలే కాక, దత్తమండలములుకూడ మానాయన సందర్శించెను. ఎక్కువగ ధన సంపాదనము చేసి, జ్యేష్ఠసోదరునికి సొమ్మాంపి, మంచిభూవసతి సంపాదించెను. ధన సంపాదన విషయమై మాతండ్రి త్రొక్కినత్రోవ సరియైన దని చెప్పువాఁడను గాను. కుటుంబపోషణము చేసికొనుటయం దెట్టి ప్రవర్తన మైనను