పుట:2015.373190.Athma-Charitramu.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 322

దింపిరి. అంత మా ప్రార్థనమీఁద దాసు శ్రీరాములుగారు సభా వేదిక నెక్కి, తాము ధర్మశాస్త్రములు సాంగముగఁ జదివితి మనియు, అసలు తీర్మానమున కడ్డుపెట్టువారు జాతిద్రోహులు శాస్త్రద్రోహులు నని గంభీరస్వరమున నుపన్యసించిరి ! దీని పర్యవసానము, మొదటిసవరణ కొనివచ్చిన పండితంమన్యుఁడు సభ నుండి నిశ్శబ్దముగ నిష్క్రమించెను ! తీర్మాన మేకగ్రీవముగ నామోదింపఁబడెను ! నాఁడు వ్యవధానము లేకపోవుటచేతను, మరల భిన్నాభిప్రాయములతో సభ చీలిపోవు నను భయమునను, నాయఁడుగారు కార్యప్రణాళికనుండి వితంతూద్వాహమును గుఱించిన తీర్మానమును దీసివైచిరి. వారి యంత్యోపన్యాసము హృదయరంజకముగ నుండెను. ఈనాఁడే సుప్రసిద్ధరాజకీయవేత్తయగు గ్లాడుస్టనుగారు చనిపోయి రని తెలిసెను.

మఱునాఁడు (22, ఆదివారము) సంస్కృతపాఠశాలలో ప్రార్థన జరిపితిమి. ఇదియే గుంటూరు పుర ప్రార్థన సమాజ జననకాలము. మిత్రులతోఁ గూడి నేను బెజవాడ తిరిగివచ్చితిని. బెజవాడలో సంఘసంస్కరణ సమాజస్థాపనము యుక్తమని మాకుఁదోఁచి, 23 వ తేదీని యొకసభ చేసితిమి. పదునొక్క సభ్యులతోను, ఒక యభిమానితోను బెజవాడ "సంఘసంస్కరణ సమాజము" నెలకొల్పఁబడెను. దానికి శ్రీవేమవరపు రామదాసుపంతులుగారిని కార్యదర్శిగ నెన్నుకొంటిమి.

26. తమ్ముని వివాహము

ఇంటిలోని విలువగల వస్తువులను శిష్యుడు వెంకయ్య గదిలో నుంచి, మేము 25 వ మేయిరాత్రి బయలుదేఱి మఱునాఁటి ప్రొద్దునకు రాజమంద్రి చేరితిమి. తలిదండ్రులను తమ్ముఁ జెల్లెండ్రను