పుట:2015.373190.Athma-Charitramu.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

23. "చిప్పల శివరాత్రి" 313

"ఇంటిలోనిపోరు ఇంతంత గాదయా"అను వేమనయోగిపలుకుల సత్యము మాకు ద్యోతకమయ్యెను. ఇట్టిగృహకల్లోల మొకటి ఫిబ్రవరి 19 వ తేదీని శివరాత్రినాఁడు మాకు సంభవించెను.

శివరాత్రికి కృష్ణస్నానమునకై వేలకొలఁదిప్రజలు చుట్టుపట్టుల నుండి బెజవాడకు వచ్చుచుందురు. ఆనాఁడు విశాలక్షమ్మగారితోఁ గలసి నాభార్య యేటికి స్నానము చేయఁబోయెను. ఇది నా కెంతయు నసమ్మతము. గృహిణిమీఁద గసి తీర్చుకొనుటకె యామధ్యాహ్నము నేను పింగాళీకంచమున నన్నము తింటిని ! నదీస్నానము చేసివచ్చిన తా నీగాజుచిప్పలు కడిగి మైలపడినది గావున, నాభార్య యానాఁడు భుజింప నని చెప్పివేసెను. దీనితో నాయాగ్రహము ప్రజ్వరిల్లెను. తా నుపవాసము చేయుట యయుక్తమును, నా కసమ్మతము నని నేను గట్టిగఁ జెప్పి కోపించుటచేత, ఎట్టకేల కామె రాత్రి భుజించెను. ఈపుణ్యదివసము మాయింటఁ గేకలతోను రోదనముతోను జరిగిపోవుటచేత, దీనికి నా చిన్ని తమ్ముఁడు సూర్యనారాయణ "చిప్పల శివరాత్రి" యని నవ్వుటాలకుఁ బేరుపెట్టెను !

ఈ సంవత్సరము న్యాయవాదిపరీక్షయందు తమ్ముఁడు వెంకటరామయ్య జయమందె నని మార్చి 15 వ తేదీని తెలిసి, సంతోషమున మిన్నందితిని.

"దేశాభిమాని" యనుపేర ఆంధ్రాంగ్లవారపత్రిక నొకటి ప్రచురింప వీరభద్రరావుగారు నేను నుద్దేశించితిమి. దాని కాంగ్ల రాజకీయ వ్యాసములు వ్రాసి, అవి దిద్ది పంపుఁ డని మిత్రులు వెంకటరత్నమునాయఁడుగారికి నేను బంద రంపితిని. కాని, నాయఁడుగా రవి దిద్దకపోవుటయేగాక, మరల మా కవి పంపనైన లేదు ! అందువల