పుట:2015.373190.Athma-Charitramu.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 312

మీఁదనే నాకుఁ గావలసిన సొమ్మిచ్చెద నని యతఁ డనెను. వేగమే బెజవాడ రమ్మని యింటియజమానునికిని మాతండ్రిగారికిని తంతి నంపితిని. వారిరువురును వచ్చిరి. కాని, పూర్వ మొకవితంతువు అమ్మిన స్థలములో నీయిల్లు కట్టఁబడుటచేత, ఇంటి హక్కునుగుఱించి ముందు చిక్కులు రావచ్చునని భీతిల్లి, యిల్లుకొనుట మానుకొంటిమి.

ఇటీవల రాజమంద్రిలో నగలు కుదువఁబెట్టి తెచ్చినసొమ్ము నేను జెల్లింపనేలేదు. కాఁబట్టి నా కెటులో సొమ్మీయ సిద్ధమైన రాజారావునొద్ద 300 రూపాయిలు బదులు తెచ్చి, నగలు విడిపింపుఁడని యాసొమ్మును రాజమంద్రికిఁ బోవుచుండెడి మాతండ్రికిఁ దమ్మునికి నిచ్చివేసితిని.

ఆరోజులలో నాకుఁ దగినంత చిత్తశాంతి లేకుండెను. చేయుపనియు చదివెడిచదువును ఎక్కువయై, నాకిట్లు మనశ్శాంతి తొలఁగ లేదు. మీఁదుమిక్కిలి వానివలన నా కొకవిధమగు విరామమే కలిగెనని చెప్పవచ్చును. అట్టి కార్యవ్యాజమే లేకున్నచో, స్థితిగతులను గుఱించియు మా దురవస్థను గూర్చియు తలపోసి నా మనస్సు విచార పంకమున మఱింత గాఢముగ మునిఁగిపోయెడిదియే ! కనులముందట నే యప్పు పెరిఁగిపోవుచుండుటయును, చేత తగినంతసొమ్ము లేకుండుటయును నా యలజడికిఁ గొంత కారణము. దీనికిఁ దోడుగ నింట సతికిఁ బతికిని సామరస్యము లేకుండెను. బుద్ధిపూర్వకముగ నే నప్పులపాలగుచుంటినని భార్య యపోహము ! ఇంగ్లీషు నేరువు మనియు పూర్వాచార పరాయణత్వము వీడు మనియు నే నామెను శాసించు వాఁడను. ఒక్కతెయె యింటిపనులు చేసికొనవలసివచ్చిన యామె కీచదువు కంటకసదృశమయ్యెను. సతి ప్రాఁతయాచారముల నంటి పట్టుకొని యుండుట నాకుఁ గడు దుస్సహముగ నుండెను. కావున