పుట:2015.373190.Athma-Charitramu.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

19. సంఘసంస్కరణసభ 293

గ్రంథమును, ఆస్తిక పుస్తకాలయమునుండి కార్లయిలుని "శూరులు, శూరపూజ"యు, ఆడమ్సువిరచితమగు "నిరాడంబరజీవితము, ఉత్కృష్ట విచారము" అను పుస్తకమును జదువఁ దీసికొంటిని. ఒకటి రెండు దినములలోనే ఇమర్సనుని "ఆంగ్లేయుల గుణవిశేషములు", "పరమాత్మ", అను వ్యాసములును, కార్లయిలుని "వీరప్రవక్త" అను రచనమును జదివి వినోదించితిని. వీరిరువురును ప్రతిభాశాలురగురచయితలె. ఐనను, ఇమర్సనునికంటె కార్లయిలె నామనస్తత్త్వము నెక్కునగ నాకర్షించెను. ఇమర్సనునందు మౌనగాంభీర్యములు, బ్రహ్మజ్ఞానసంపత్తి, ఆత్మోపలబ్ధియును నతిశయించియుండెను. కార్లయిలునందు ధైర్యశూరతావాగ్విభవములు ప్రదర్శితములయ్యెను. ఇమర్సను ఆత్మవిచార దీక్షను, కార్లయిలు కార్యోత్సాహమును బురికొల్పుచుందురు. మొదటి రచయిత మనస్సును దేవునిదెసకు మరలుపఁ జూచును. రెండవవాఁడు మనుష్యుని నీచతాహేయత్వములను నిరసించును. ఇరువురు నసమాన ప్రతిభావంతులును, పరమార్థతత్త్వకోవిదులును.

ఈసెలవులలో మాయప్పుదారులలో నిరువురకుఁ దిరిగి క్రొత్త పత్రములు వ్రాసి యిచ్చి సంతృప్తిపఱచితిమి. మాకడగొట్టుతమ్ముఁడు సూర్యనారాయణకు వడుగు చేసితిమి.

ఈసంవత్సరము గోదావరిమండల సభలు ఏలూరులో జరుగుట కేర్పాటయ్యెను. రాజకీయసభకు రెంటాల వేంకటసుబ్బారావుపంతులుగారు అగ్రాసనాధిపతులు. సాంఘిక సభకు న్యాపతి సుబ్బారావుపంతులుగారధ్యక్షులుగ నుండుట కంగీకరించిరికాని, వారు రాలేకపోవుటచేత, కందుకూరి వీరేశలింగముపంతులుగా రగ్రాసనాసీనులైరి.