పుట:2015.373190.Athma-Charitramu.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 294

సతీసమేతముగ నే నీసభల కేగ నిశ్చయించుకొనుట మాతల్లికి సమ్మతముగ లేదు. ఐనను, 7 వ జూనుతేదీని మే మిరువురమును ఏలూరు బయలుదేఱితిమి. సాంఘికసభా కార్యదర్శి శ్రీ సత్తిరాజు కామేశ్వరరావుగారియింట మేము విడిసితిమి. బహిరంగసభకు భార్య నాతఁడు గొనిపోవుట అతని సోదరులకును నంగీకృతము కాలేదు. కాని, యీవిషయమున నావలెనే కామేశ్వరరావుకూడ గట్టిపట్టు పట్టెను. 9 వ జూనున జరిగిన సాంఘికసభలోనికి కామేశ్వరరావు నేనును పత్నీసమేతముగఁ బోయితిమి. రాజ్యలక్ష్మమ్మగారును సభ కేతెంచిరి. ఇంకఁ గొందఱు స్త్రీలుకూడ సభకు వచ్చి, స్త్రీలకొఱకు బ్రత్యేకించినప్రదేశమున నాసీనలయిరి.

వీరేశలింగముగారి యధ్యక్షతక్రింద జరిగిన యాసభలో 'స్త్రీవిద్య' 'అతిబాల్యవివాహముల'ను గుఱించిన తీర్మానములను నే నుపపాదించితిని. సభ నిర్విఘ్నముగ జరిగెను. కొలఁదికాలము క్రిందటనే తండ్రి కాలధర్మమునొందిన నా తోడియల్లుఁడు సత్తిరాజు వెంకటరత్నమును, మామఱఁదలు శ్యామలాంబను బంధువులను మే మంత పరామర్శ చేసి, మఱునాఁటిరాత్రికి రాజమంద్రి చేరితిమి. అంత వీరేశలింగముగారి యధ్యక్షోపన్యాసమును నే నాంగ్లము చేసి, ఎల్లేపద్ది నారాయణశాస్త్రిగారి కిచ్చితిని. అది యాంగ్ల పత్రికలలోఁ బ్రకటననిమిత్తము మద్రాసు పంపఁబడెను.

22 వ జూను తేదీని విక్టోరియా మహారాణిగారి జూబిలీమహోత్సవము రాజమంద్రిపురమందిరమున నతివైభవమున జరిగెను. కలక్టరు బ్రాడీదొర అగ్రాసనాధిపత్యము వహించెను. వీరేశలింగముపంతులుగారొక తీర్మానమును ప్రతిపాదించుచు, రాణీగారి చరిత్రాంశములను జెప్పిరి. కొందఱు పద్యములు చదివిరి. వీథులలో పెద్ద యూరేగింపు