పుట:2015.373190.Athma-Charitramu.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

15. కీళ్ల వాతము 279

నాభార్యయు నన్నొక బండిలోఁ గూర్చుండఁ బెట్టి, ఎద్దులేని యా బండిని తామె లాగి, మా తోడియల్లుని బసకు నన్నుఁ జేర్చిరి !

24 వ తేదీవఱకును నావ్యాధి మరలక, ముఖ్యముగ రాత్రులందు పెనుభూతమై నన్నుఁ బీడించుచుండెను ! కంటిమీద ఱెప్ప వేయక భార్య నామంచమునొద్ద కనిపెట్టుకొని పరిచర్యలు చేయుచుండెడిది. తల్లియు నాకొఱ కమితశ్రమ పడుచుండెను. వారల యవస్థ తలంచుకొనునపుడు, నావ్యసనము మఱింత దుర్భర మగుచువచ్చెను !

ఎట్టకేలకు జనవరి 24 వ తేదీని, గోడ పట్టుకొని కొన్ని యంగలు వేయఁగలిగితిని. ఆరాత్రి నాకు బాధ లేకుండెను. దీనికై నేను దైవమునకుఁ బ్రణతు లొనర్చితిని.

కొలఁదిదినములలో నేను బెజవాడకును, వెంకటరామయ్య పరీక్షకై మద్రాసునకును బోవలయును గాన, భూము లమ్ముపని మాతండ్రి కొప్పగించితి మని ఆయనపేరిట మే మిరువురమును పౌరాష్ట్రనామా వ్రాసి యిచ్చితిమి. అనంతముగారీ తరుణముననే బెజవాడ వదలి వేఱొక యుద్యోగమునకుఁ బోవుచుంటి మని వ్రాయుటచేత, మేము బెజవాడ పయనమునకు సిద్ధమైతిమి. ఇట్టిస్థితిలో సోదరులను, తలిదండ్రులను విడిచిపోవ నాకు విషాదకరముగ నుండెను.

ఎట్టకేలకు 26 వ జనవరి ప్రొద్దున భార్యాసమేతముగ నేను బెజవాడకు బయలుదేఱితిని. మద్రాసుపోవలసిన తమ్ముఁడు వెంకటరామయ్యయు రంగనాయకులు నాయఁడుగారి పెద్దకుమారుఁడు నారాయణస్వామియును మాతో వచ్చి, నా కెంతయు సాయము చేసిరి. గోదావరి యావలి యొడ్డున రెయిలుబండిలోఁ గూర్చుండి మధ్యాహ్నమునకు మేము బెజవాడ చేరితిమి.