పుట:2015.373190.Athma-Charitramu.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 258

క్షలో నాంగ్లమున తప్పి, ఆపరీక్ష కిచట చదుటకై చెన్నపురి క్రైస్తవకళాశాలలోఁ జేర నుద్దేశించెను. కలకత్తా భారనగరమున తాను నెలకొల్పి నడిపెడి "వితంతు శరణాలయమున"కు చందాలు పోగుచేయుటకై మద్రాసు వచ్చియుండిన శశిపాద బెనర్జీగారిని 5 వ మార్చి ని మిత్రులతో నేను సందర్శించి. నాకుఁ దోఁచిన కొంచెము చందా వారి కిచ్చితిని.

యల్. టి. పరీక్ష రెండవభాగమున నీరెండవసారికూడ నే నపజయముఁ గాంచుటచేత, ఆ లోపమును గొంత పూరించుటకై నేను యం. యె. పరీక్ష కింటఁ జదువ నుద్దేశించితిని. డాక్టరు సత్యనాధముగారిని జూచి, తత్త్వశాస్త్రమున యం. యే. పరీక్షకుఁ జదువ వలసిన పుస్తకములను గుఱించి వారి యాలోచనలు గైకొంటిని. కొన్ని పుస్తకములు కొని బెజవాడ తెచ్చుకొంటిని. చెన్నపురి కళాశాలలోఁ దనకు సౌకర్యము గలుగని కారణమున, వెంకటరామయ్య నాతో బెజవాడకు వచ్చి మాతల్లిని చెల్లెలిని దీసికొని రాజమంద్రి వెడలిపోయెను. బెజవాడలో మాతో నుండలేక, తమ్ముఁడు సూర్యనారాయణ వారిని వెంబడించెను !

పాఠశాలలో తోడిబోధకులగు రామమూర్తిగారు నాకీ కాలమున నిత్యసహవాసులైరి. విద్యాశాలలోను, బయటను మే మిరువురమును గలసి మాటాడుకొనుచు కాలము గడుపు చుందుము. ఆయన బోధనము ననుసరించి నే నిపుడు కార్లయిలు విరచితమగు "సార్టరు రిసార్టసు" అను గ్రంథరాజమును జదువ మొదలిడితిని. నేను యం. యే. పరీక్షకును, ఆయన బి. యే. పరీక్షలోని రెండవభాగమునకును మిగుల దీక్షతోఁ జదువ నారంభించితిమి. విద్యాపరిశ్రమమునకు ప్రాత:కాలమే మంచిసమయ మని యెంచి, మేము వేకువనే లేచి, యింటఁ