పుట:2015.373190.Athma-Charitramu.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 256

ఆకాలమున బెజవాడలో డిస్ట్రిక్టుమునసబుగనుండిన కొప్పరపు రామారావుగా రిచ్చిన కొన్నివేల రూపాయిల విరాళముమీఁద వచ్చెడి వడ్డితో, ఏఁటేఁట నాంధ్రదేశమం దున్నతవిద్య నేర్చెడి పేద నియోగి బాలురకు వేతనము లీయఁబడుచుండెడివి. ఈ "యాఱువేల నియోగివిద్యార్థి సహాయకసమాజ" కార్యనిర్వాహక సభలో న న్నిటీవల సభికునిగ నెన్నుకొనిరి. 19 వ జనవరిలో జరిగిన సభకు నే నధ్యక్షుఁడను. వర్ణభేదములను బాటింపని నే నీనియోగులసమాజమునఁ జేరుటకు సందేహింపమికి, అది వట్టివిద్యాసంస్థ యని భావించుటయే కారణము.

మా తలిదండ్రులు రాజమంద్రివిడిచి బెజవాడ రాలేకపోయిరి. బెజవాడలో నాతో నాతమ్ములిద్దఱుండుటచేత, ఇంటి పని యొక్కతెయుఁ జేసికొనిలేక, నాభార్య మూలుగుచు, నామీఁద చిరచిర మనుచుండెడిది. తలిదండ్రులను విడచి యుండుటకు సూర్యనారాయణ లోన బెంగపెట్టుకొనియుండెను. నేను "జనానాపత్రిక"కు వ్రాసినవ్యాసములు వానిచేఁ జదివించుచును, పత్రికకు సొంతముగ వ్రాయుమని హెచరించుచును, ఎటులో వానిదృష్టిని జదువునకు మరలింపఁ జూచితిని. ఇంకను బలహీనుఁ డగు కృష్ణమూర్తికి బలముపట్టు మందు లిప్పించుటకై రంగనాయకులునాయఁడుగారితో నే నుత్తరప్రత్యుత్తరములు జరిపితిని.

సంసార లంపటయు నింద్రియలోలత్వమును నాయందు పెచ్చు పెరిఁగి, నామనస్సు నీశ్వరధ్యానమునుండి మెల్ల మెల్లగఁ దొలఁ గించుచుండెను. దైవభక్తియందు నాకుమరల తీపి గలిగింపఁగల యుదంత మొకటి యిపుడు సంభవించెను. నాపూర్వపరిచితులగు దుగ్గిరాల రామమూర్తిగా రీపాఠశాలలో ప్రకృతిశాస్త్రబోధకులుగ