పుట:2015.373190.Athma-Charitramu.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11. నూతన వత్సరము 255

నేను మరల మృత్యుంజయరావును గలసికొని మాటాడితిని. సత్యసంవర్థనితోడి సంబంధము కొన్ని మాసములనుండి నేను వదలుకొనినను, నాస్నేహితునిరీతిఁ జూచి, మార్చి నెలనుండి యాపత్రికకు వ్రాయుదు నంటిని. అంత నందఱి యొద్దను వీడ్కోలు గైకొని బెజవాడకు వెడలిపోయితిమి.

చదువు నిమిత్తమై తమ్ములు కృష్ణమూర్తి సూర్యనారాయణులను బెజవాడకు మాతోఁ గొనివచ్చితిమి. వారిని మాతో నంపుటకు మాతల్లి కెంతో కష్టముగఁ దోఁచెను. 16 వ తేదీని మేము బెజవాడ చేరితిమి. మాపాఠశాల మంచిస్థితిలో లేకుండుటకు నే నెంతయుఁ జింతిల్లితిని. ఇది కారణముగ బెజవాడలో నాయునికి కంతరాయము గలుగవచ్చు నని భయమందితిని.

17 వ తేదీని వీరేశలింగముగారు సకుటుంబముగ మద్రాసు నుండి రాజమంద్రికి వచ్చుచు, మార్గమధ్యమున భోజనము నిమిత్తమై బెజవాడలో మా యింటికి వచ్చిరి. అపుడు మాయింట నన్న మమర కుండుటవలన, వేఱుచోట వారు భుజించిరి. ఈయశ్రద్ధకై భార్యమీఁద నేను గోపించితిని.

అందఱు నొకచోట నివసించినచో కుటుంబవ్యయము తగ్గునని నేను జెప్పఁగా, రాజమంద్రిలోని కాపుర మెత్తివైచి, బెజవాడలో నాయొద్ద నుండుటకు మా తలిదండ్రులు సమ్మతించిరి. తగినంతస్థలము సమకూరుటకై గోవిందరాజులవారి యింటిలో నుత్తరభాగము విడిచి, విశాలమగు దక్షిణభాగమును, దానితోఁ జేరియుండు వీథివసారాగదియును మేము నెల కైదు రూపాయీల బాడుగకుఁ దీసికొని, దానిలోనికిఁ గాపురము తరలించితిమి.