పుట:2015.373190.Athma-Charitramu.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10. బెజవాడ స్నేహితులు 249

కెంతో మనస్తాపము గలిగె నని వేఱె చెప్ప నక్కఱలేదు. "మానవ మాత్రులు భూషణదూషణములకు సరిసమానముగఁ దలయొగ్గవలయు" నను లోకోక్తిని ఆకష్ట సమయమున నొకమిత్రుఁడు వచించుచుండుట నాకిప్పటికిని జ్ఞాపకము.

నేను బెజవాడ వచ్చిననాఁటినుండియు ద్వితీయోపాధ్యాయుఁడగు దేవసహాయముగారికిని నాకును మంచి స్నేహము కలసెను. మే మిరువురము సమవయస్కులము ; పలువిషయములందు పరస్పర సానుభూతి గలిగియుండువారము. క్రొత్తగ నుద్యోగమునఁ బ్రవేశించిన యువకుఁడనగు నాకష్టసుఖము లాయన యారయుచు, సోదరునివలె నిరంతరము నన్నుఁ బ్రేమించుచుండువాఁడు. ఈసంవత్సరాంతముననే యాయన బెజవాడ విడిచి మద్రాసులో నుద్యోగస్వీకారముఁ జేయ నుద్దేశించెను. నే నీపాఠశాలయం దెట్లు మెలఁగవలయునో, ఎవరి నెట్లు చూడవలయునో, నా కాయన బోధించుచుండువాఁడు. ఇరువురమును ప్రథమోపాధ్యాయునిదెస గౌరవభావము గలిగియేయుండెడివారము. ఐనను కొన్ని చిన్న సంగతులందు వారితో మాకుఁగల యభిప్రాయభేదములె, మాయిద్దఱి పొత్తును వృద్ధిచేసెను. దేవసహాయముగారు బెజవాడ వీడుదినములు రాఁగా, విద్యార్థులు తమగురువునకు బహుమానపూర్వకమగు విజ్ఞాపనపత్ర మొసంగ నిశ్చయించి, మాయిరువురికిని గల చెలిమిని బాటించి, నన్నే యాపత్రము సిద్ధపఱుపఁగోరిరి. 7 వ డిసెంబరున పాఠశాలలో జరిగిన బహిరంగసభలో నేనే విజ్ఞాపనపత్రమును జదివితిని. సహృదయుఁడు సరళ స్వభావుఁడు నగు దేవసహాయమహాశయునకుఁ దగినట్టుగ, సద్భావ పూరితముగను, లలితపదయుతముగను వినతిపత్ర మలరారుచుండెనని సదస్యులు సంతోషభరితులైరి.