పుట:2015.373190.Athma-Charitramu.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 248

ఆకారణమున విద్యార్థుల మనస్సులలోఁ గొంత సంచలనము గలిగెను. క్రైస్తవ పాఠశాలలోని హిందూవిద్యార్థులు, అన్యమతధర్మములను గుఱించియు, సంఘసంస్కరణావశ్యకమును గుఱించియు వినుచుండు వారలయ్యును, హిందువునగు నానోటనే యట్టి వాక్యము లాకర్ణించుట కచ్చెరువొందుచుండువారు. దేవళ్రాజు అనంతరామయ్య యను మా పాఠశాలలోని ప్రవేశపరీక్షతరగతి విద్యార్థి, విగ్రహారాధనమును నిరసించి, తోడివిద్యార్థుల యాగ్రహమునకుఁ బాల్పడియెను. "హిందూబాలసమాజ" సభకు నే నొకమాఱు పోయి, అచట విగ్రహారాధనమును గుఱించి జరిగిన చర్చలోఁ బాల్గొంటిని. సంస్కరణ పక్షాభిమానులగు విద్యార్థిబృందమునకు నే నిట్లు నాయకుఁడ నైతిని. పాఠశాలలోను బయటను, సంస్కరణ విషయములను గుఱించి విద్యార్థులతో నేను జర్చలు సలుపుచుండువాఁడను. 15 వ నవంబరున పాఠశాలలో "విద్యార్థి ప్రసంగసమాజ" సంవత్సరోత్సవము జరిగెను. ఆ సందర్భమున సమాజసభ్యులను హెచ్చరించుచు నా యధ్యోక్షోపన్యాసము చదివితిని. సభకగ్రాసనాధిపతి యగు డిస్ట్రిక్టుమునసబు కొప్పరపు రామారావు పంతులుగారు నా యుపన్యాసమును గొంత నిరసించినను, సభ్యుల కది సమ్మోదముగ నుండుటచే నాకుఁ బ్రోత్సాహము గలిగెను.

లోకమున నెట్టి సాధుజనులకు నొక్కొక్కతఱిని శాంతముగ దినములు గడువవు. ఆ నవంబరునెలలో మా యుపాధ్యాయులలోఁ గొందఱి కాకాశరామన్న యుత్తరములు వచ్చెను. ఒక పుణ్యవతి వర్తనమును గుఱించి యందు హేయమగు నపవాదములు సూచింపఁ బడెను ! ఊరునకుఁ గ్రొత్తనగు నా కిట్టిలేఖలు రాకుండినను, మిత్రుల వలన నీసంగతి విని నేను మిగుల విషాదము నొందితిని. ఆదంపతుల