పుట:2015.373190.Athma-Charitramu.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 242

హిందూమత మనిన నాకెంతో వెగటుగను విగ్రహారాధనము కంటకసదృశముగను నుండెడిది. మా చిన్న మేనమామ వెంకయ్యగారు మమ్ముఁ జూచిపోవుటకు సెప్టెంబరు 5 వ తేదీని బెజవాడ వచ్చి, కృష్ణానదిని కనకదుర్గాలయమును దమకుఁ జూపింపుమని నన్ను గోరిరి. నేనీ పట్టణము వచ్చి కొన్ని నెలలైనను, దుర్గాదేవిదర్శన మింకను జేసికొనియుండలేదు. మామేనమామ ప్రోత్సాహమున నేనిపుడు ఆగుడి కేగితిని. పర్వతమధ్యమున నొక రమ్యప్రదేశమునం దాదేవాలయము నిర్మింపఁబడెను. ఆ పరిసర దృశ్యము లత్యంత రమణీయములు. మామామ నన్ను గర్భాలయములోని కాహ్వానింపఁగా, ఆయనను సంతృప్తిపఱచుటకే నేను లోని కేగినను, దుర్గ విగ్రహమునకు మ్రొక్క నాకుఁ జేతులు రాలేదు! భక్తిపారవశ్యమున వినమ్రుఁడైన తనసరసను, చేతులు జోడింపక, చెట్టువలె నిలువఁ బడిన నామీఁద మామామ మిగుల విసువుఁజెందెను. దేవునికిని పూజారికిని కాసైనఁ జెల్లింపక నే నెటులో యంతట బయటపడితిని !

సెప్టెంబరు 8 వ తేదీని బెజవాడపట్టణ మమితకల్లోలమున కాకర మయ్యెను. కొన్ని దినములక్రింద నచటి కొక మార్వాడీవర్తకుఁడు వచ్చి, యెక్కువ వడ్డీనిచ్చి, జనులనుండి చిన్న చిన్న యప్పులఁ గొనఁజొచ్చెను. రూపాయి బదులిచ్చినవానికి వారమురోజులపిమ్మట పావులావడ్డితో అసలీయఁబడుచుండెడిది ! ఈమనుజునిచుట్టును జనులు మూఁగుట చూచి, యీతనివలెనె మఱికొందఱు ఎక్కువవడ్డీకి బదుళ్లు పుచ్చుకొనసాగిరి. అంతకంతకు వడ్డీపరిమితి పెరిఁగి, వారమునకు రూపాయికి రూపాయి యయ్యెను ! పేదజను లీ వ్యాపారవ్యామోహమునఁ బడి, తమ వృత్తులు కట్టిపెట్టి, తమకుఁగల ధనమంతయు బదుళ్లలోఁ ద్రిప్పసాగిరి. ఒకనాఁడు నామిత్రుఁడును, వాణీముద్రా