పుట:2015.373190.Athma-Charitramu.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8. యం. యే. పరీక్ష 243

క్షరశాలాధికారియును నగు శ్రీ దాసు కేశవరావుగారియింటికేగి, యచట ముద్రితమయ్యెడి ప్రకటనపత్రిక నొకటి నేను జూచితిని. "అత్యా పేక్షాధైర్యసంఘము" అను పెద్దపేరు పెట్టుకొనిన యొక వడ్డీవ్యాపారస్థుని సంస్థనుగుఱించిన కాకితమే యిది! అత్యా పేక్ష ధైర్యమునకైనను అధైర్యమున కైనను, ఎడమీయు నని యిందలి ధ్వన్యర్థ మని నవ్వుచు స్నేహితుఁడు నాకుఁ జెప్పెను. నదీప్రవాహమునఁ గన్పడు బుడగలవంటి యీవర్తకసంఘములు, దురాశచే నేర్పడు నవియేగాని సదుద్దేశముతో నెలకొల్పఁబడునవి కావు. అప్పుపుచ్చుకొన్న కొంచెపు మొత్తములతో విరివిగ నేవర్తక వ్యాపారములు స్వల్ప కాలమున సాగఁగలవు? కావున కేవల ద్రోహ చింతనముతోనే యీసంఘములు వెల సె ననుట స్పష్టమయ్యెను. ఈద్యూతవ్యాపారము ప్రబలు దినములలో రక్షకభటులు, ప్రభుత్వోద్యోగులును ఏచర్యనుఁ బుచ్చుకొనక, 8 వ సెప్టెంబరున నకస్మాత్తుగ సంఘమువెంటసంఘము దివాలుచేయుటచేత సొమ్ము పోఁగొట్టుకొనిన జనుల కోలాహలము ప్రబలినప్పుడుమాత్రమే, వారు తమ కర్తవ్యమునకుఁ గడంగుటకై కనులు తెఱచిరి ! పురమం దెచటఁ జూచినను కొద్దిగనో గొప్పగనో సొమ్ము పోఁగొట్టుకొని విలపించుజనులే గానవచ్చిరి ! మాపాఠశాల బంట్రోతు కనకయ్య తన సంగతి నాకుఁ జెప్పెను. తాను మూఁడు నాలుగు రూపాయి లీ యప్పులకు ముందు పెట్టుబడి పెట్టి, కొద్ది రోజులలో ముప్పది రూపాయలవఱకును బెంచి, దానిలోఁ జాలవఱకిపుడు కోలుపోయినను, తనయొద్ద నింకను పది పదునైదు రూపాయిలు నిలిచియుండె నని చెప్పెను. కడుధైర్యముతోనైనను అధైర్యముతోనైనను అతిలోభబుద్ధితో జరిగెడియిట్టి వ్యాపారద్యూతము, జనసామాన్యమునకు తుదకు చేటు తెచ్చుననుట కీయుదంతమే తార్కాణము!