పుట:2015.373190.Athma-Charitramu.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48. ఆస్తిక పాఠశాల 203

లిచ్చి నా యారోగ్యము చక్కపఱతునని నన్నుఁ బ్రోత్సహించిరి. సత్యసంవర్థనికి వ్యాసములు వ్రాయుట, చందాదారులకుఁ బత్రికలంపుట, సమాజపుస్తకాగారము సరిచూచుట మున్నగుపనులతో దినములు గడపితిని. స్కాటు, షేక్‌స్పియర్ మున్నగు కవులరచనములు చదివి వినోదించుచుంటిని.

ఒక్కొక్కప్పుడు కడుపులోనిబాధ యుద్రేకించి నన్ను వేధించు చుండెను. రంగనాయకులునాయఁడుగారు ప్రీతిపూర్వకముగఁ జేసిన వైద్యమువలన, శరీరమునఁ గొంతస్వస్థత గలుగుచుండెను. పరిపూర్ణారోగ్యము లభించుటకు నే నిచ్చట నింకొకనెల యుండవలయునని స్నేహితు లనిరి కాని, సైదాపేటకళాశాలాధ్యక్షునికోరికమీఁద గాని, నా సెలవు పొడిగింప వీలుపడదని మండలవైద్యాధికారి చెప్పివేసెను. మరల సైదాపేట పోవుట తప్ప నాకు గత్యంతరము లేదు ! నే నంత ప్రయాణసన్నాహము చేసితిని. 10 వ సెప్టెంబరున చెన్నపురి సుఖముగఁ జేరి, కళాశాలలో మఱునాఁడు ప్రవేశించితిని.

48. ఆస్తికపాఠశాల

నేను తిరిగి సైదాపేట సేమముగ వచ్చినందుకు సహచరులు సంతోషించిరి. కళాశాలకుఁ బోయి, యథాప్రకారముగ నాపనులు చూచుకొనుచువచ్చితిని. ఐనను, నాశరీరమునుండి రోగాంకురములు పూర్తిగఁ దొలఁగిపోలేదు. అపుడపుడు నాకు జ్వరము, అజీర్ణమును గానిపించుచునేయుండెను. నాభార్యకుఁగూడ జబ్బుచేయుచునే వచ్చెను. సైదాపేట శీతలప్రదేశ మగుటచేత, తఱచుగ మా కస్వస్థత గలుగుచుండె నని మిత్రు లనుచువచ్చిరి.