పుట:2015.373190.Athma-Charitramu.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

47. వ్యాధిగ్రస్తత 199

రావుగార్లు పరశువాకములో బుచ్చయ్యపంతులుగారియింటఁ గలసి కాపురము చేయునట్టుగను, సైదాపేటలోఁ గాపురముండు నేను మృత్యుంజయరావునకు భోజనసౌకర్యము చేయుటకును, ఏర్పాటు లయ్యెను ! సహాధ్యాయుఁడు కొల్లిపర సీతారామయ్యగారు సకుటుంబముగ నుండు నింటిభాగమున మేము సైదాపేటలోఁ గాపుర మేర్పఱుచుకొంటిమి. కురుపులబాధతో మాకడగొట్టుచెల్లెలు చనిపోయెనని తెలిసి మిగుల విషాద మందితిమి.

47. వ్యాధిగ్రస్తత

నేను సైదాపేటలో పాదము పెట్టుటయే తడవుగ నాశరీరమున మరల వ్యాధి యంకురించెను. జ్వరముతో నారంభించినరోగము మెల్లగ నజీర్ణవ్యాధిగఁ బరిణమిల్లెను. నా జఠరము మిగుల బలహీన మయ్యెను. మద్రాసునందలి మిత్రుఁడు నారాయణస్వామినాయఁడు గారు మంచిమందు లిచ్చెనేగాని, రోగములొంగక లోలోననే రగులు చుండెను. నీరసము హెచ్చెను. కొంచెము నెమ్మదిగ నుండినపుడు పాఠాశాలకుఁ బోయి విద్య గఱపుచును, బజారువెచ్చములకై యెండలోఁ దిరుగుచును నుంటిని. ఈమధ్యగ నొకటిరెండుసారులు నాభార్యయు జబ్బుపడెను. ఎటులో నా పనులు చేసికొనుచు, నేను దినములు గడుప నెంచితిని.

"లంకణములలో మనుగుడుపు" అనునట్టుగ, కష్టపరిస్థితులందు నాభార్యకుఁ జదువు చెప్పుటకును, ధర్మసూత్రములు బోధించుటకును నేను బూనుకొంటిని ! నాసహచరుఁడు సీతారామయ్యగారిసతియు జననియు చెల్లెండ్రును నాభార్యయం దమిత ప్రేమానురాగములు గలిగి వర్తించిరి.