పుట:2015.373190.Athma-Charitramu.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

43. పట్టపరీక్ష 185

వలో "సత్యసంవర్థని"కి వ్యాసములు వ్రాయుచుంటిని. గుంటూరిలో మృత్యుంజయరావునకు బంధువు లుండుటవలన మే మందఱము నచట నొకదినము నిలిచి చెన్నపురి ప్రయాణ మైతిమి. స్నేహితులతో నాడుచు పాడుచుండుటచేత, ఆ దీర్ఘ ప్రయాణమువలని బడలిక నా కగఁబడలేదు. లింగి సెట్టివీథిలో నుండు రామలింగయ్య పూఁటకూళ్ల యింటి మేడలో నామిత్రుఁడు గంగరాజు నివసించెను. అది నా కతఁ డిచ్చి, శీతకాలపు సెలవులకుఁ దాను నర్సాపురము వెళ్లిపోయెను. మృత్యుంజయరావు, అతని భార్యయును, పరశువాకము వెళ్లి, అచ్చట మన్నవ బుచ్చయ్య పంతులుగారియింట బసచేసిరి. నాకుఁ జేరువనె సాంబశివరావు మున్నగు స్నేహితులు విడిసిరి. నా ప్రాఁతస్నేహితులగు వెంకటరత్నము నాయఁడుగారిని, నారాయణస్వామి నాయఁడుగారిని గలసికొని, వారితో సంభాషణములందు తీఱికకాలమును గడుపుచుంటిని. నే నిచట శ్రద్ధతోఁ జదువుచుంటిని. రాజమంద్రి స్నేహితుఁడు పానుగంటి అప్పారావుగారితోఁ దఱచుగ నేను ప్రాఁత పాఠములు తిరుగవేయుచుండువాఁడను.

నా సహాధ్యాయుఁడు రామారావుగారు పరశువాకములో జబ్బుపడుటచేత, అతని నాబసకుఁ గొనివచ్చి, వైద్యుఁడు నారాయణస్వామి నాయఁడుగారిచే మందిప్పించితిని. అతనికి నాకును నాయఁడుగారు తమ సహజకృపావిశేషముతో మందు లిచ్చుటవలన మాకు స్వస్థత గలిగెను. డిశంబరు చివరభాగమున చెన్నపురి బ్రాహ్మమందిరములో "ఆస్తికసమావేశము," బ్రాహ్మసమాజ వార్షికసభలును జరిగెను. సమాజ పత్రికయగు "ఫెల్లోవర్కరు" పత్రికను పున నుద్ధరించుటకు వెంకటరత్నము నాయఁడుగారు సమాజమిత్రులును