పుట:2015.373190.Athma-Charitramu.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36. సత్యసంవర్థని 157

36. సత్యసంవర్థని

ఏ వార్తాపత్రికనైన నెలకొల్పుటకుఁ బూర్వమే సంస్థాపకునికి స్వేచ్ఛ యుండును గాని, పిమ్మట కాదు. అది యారంభ మైనప్పటినుండియు క్రమము తప్పక నడుచుచుండవలసినదే. పత్రికాధిపతి వట్టి కీలుబొమ్మవలెను, గడియారపు యంత్రమువలెను, విసుగు విరామము లేక పని చేయవలె ననియే పాఠకజనులయుద్దేశము ! సత్యసంవర్థని మాసమున కొకతూరి ప్రచుర మగు చిన్న పత్రిక యైనను, చేయవలసినపనిమాత్ర మెక్కువగ నుండెను. సాయము చేతునని మొదట వాగ్దానముచేసిన సమాజమిత్రులు, ఏదో యొకమిష పెట్టి, సాకు చెప్పి, తప్పించుకొనుచువచ్చిరి. వ్యాసరచన తమ కభ్యాసము లే దని కొందఱును, తమరచనములు ప్రచురము కాలేదని కొందఱును. వానియందు మార్పులు చేసి రని కొందఱును, మొఱవెట్టి, యీవ్యాజమునఁ దమ వాగ్దానములను తుదముట్టించుచువచ్చిరి ! వీరేశలింగముపంతులు కనకరాజుగార్లు ప్రతినెలయును పత్రికకు వ్రాయుచునేయుండిరి. పెద్దవారగు పంతులుగారికిఁ గాని, పరీక్షకుఁ జదువు కనకరాజునకుఁ గాని, పత్రికను గూర్చిన కనులకుఁ గానఁబడని యెన్నియో చిన్నపను లప్పగించుట యనుచితముగదా. కావున మిగిలిన వ్యాసములువ్రాసి, చిత్తులు దిద్ది, పత్రికను ముద్రింపించి, చందాదారులతో నుత్తరప్రత్యుత్తరములు నేనే జరుపవలసివచ్చెను. అందువలన నా కనులబాధ విస్తరిల్లెను.

పూర్వాచారపరులగు మా కళాశాలాధ్యాపకు లొకరు, పాపఁపుప్రార్థనసమాజములోఁ జేరినకారణమున నాకనులు పోవుచుండె నని పలికిరి ! సత్యసంవర్థనీ కార్యభారముననే నా నేత్రదృష్టి ధ్వంస మగు