పుట:2015.373190.Athma-Charitramu.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 158

చుండె నని నుడివియుండినచో, ఆయనమాటలు సత్యవాక్యములుగ నుండెడివి. వ్రాఁతపని యెక్కువ యై నాకనులకు మాంద్యము గలుగు చుండెను. ఏతత్కారణముననే నాదేహారోగ్యమును జెడుచుండెనని రంగనాయకులునాయుఁడుగారు పలికి, కొంతకాలము నేను పరిపూర్ణవిశ్రాంతి నొందవలె నని హితవు చెప్పిరి. నే నందువలన సహపాఠులు చదువుచుండఁగ విని యెటులో కళాశాలలోని నిత్యవిధులు నిర్వహించుచువచ్చితిని గాని, పత్రికపని యట్లు జరుగదయ్యెను. చెన్నపురిలో పరిచితులైన శ్రీరఘుపతి వెంకటరత్నమునాయుఁడు గారి సాయము కోరఁగా, వారు రెండువ్యాసములు వ్రాసిరి. ఇట్లు నేను 1891 ఆగష్టుమాసములో వ్రాసిన "అసహనము"నకు వారు అక్టోబరులోను, నేను నవంబరులో వ్రాసిన "ప్రేమక్షమలు" అనుదానికి వారు డిశంబరులోను అనుబంధవ్యాసములు వ్రాసి పంపిరి. ఈయిరువురు రచయితలవ్యాసములకును చాల యంతరము గలదు. నావ్యాసములు భావమునను భాషావిషయమునను మిగులఁ గొఱవడియుండెను. నాయుఁడుగారివ్యాసము లన్ననో, విశాలభావములతోను విశిష్టభాషా నైపుణ్యముతోను విరాజిల్లుచుండెను.

వ్యాసమునకు వ్యాసమునకును, సంచికకు సంచికకును, ఇట్టి వ్యత్యాసము లుండుట సత్యసంవర్థని సంప్రదాయ మయ్యెను ! వెనుకటిప్రకరణములలో నొకదానియందు, మొదటిసంచికలోని వ్యాసభాగములు మచ్చునకుఁ జూపఁబడినవి. ప్రతిసంచికలోను ఆంగ్లమున నొకవ్యాసమును, తెలుఁగున రెండు మూఁడును నుండెడివి. అందుచేత నింగ్లీషువ్యాసములలోకంటె నాంధ్రవ్యాసములందే యిట్టితారతమ్యములు స్ఫుటముగఁ గానఁబడియెడివి. విఖ్యాతరచయితలగు వీరేశలింగముగారి వ్యాసరాజములకును, నాబోటి విద్యార్థి ప్రయాసమునఁ