పుట:2015.373190.Athma-Charitramu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32. పత్రికాస్థాపనము 145

వ్యాసములును వ్రాయుచువచ్చినను, అంతకంత కింగ్లీషు వ్రాయుటకే నే నేర్పఱుచుకొనుటచేత, తెలుఁగువ్యాసములు మిత్రుఁడు కనకరాజు వ్రాయుచుండువాఁడు. పత్రికలో నింగ్లీషుభాగమునకు నేను బాధ్యత వహించుటచేత, వీరేశలింగము పంతులుగారు తెలుఁగు భాగము సరిచూచుచుండువారు. అందువలన కనకరాజు తాను వ్రాసిన తెలుఁగువ్యాసములు పంతులచే దిద్దించుకొనుచు, ఆయన కోపమునకు గుఱి యగుచుండెను ! ఐన నందువలననె యతఁ డాంధ్రరచనయందు శీఘ్రముగ నిపుణుఁ డయ్యెను. ఇంగ్లీషురచనలోనే మునుఁగుచుఁ దేలుచు నుండుటచేత, తెలుఁగున బెదరుతీఱి వ్రాయుటకును, ముఖ్యముగ పంతులుగారి సుశిక్షఁ బడయుటకును, ఆ బాల్యదినములలో నా కంతగ నవకాశము లేకపోయెను.

మొదట "సత్యసంవర్ధని" యెనిమిదిపుటలతో నారంభమై, క్రమక్రమముగఁ బెరిఁగి, రెండవసంపుటమునుండియు పైపత్రముగల పదునాఱుపుటల పుస్తకరూపమున వెలువడుచుండెను. పత్రికయందు నీతి మత సంఘసంస్కరణ విషయములు బాహాటముగఁ జర్చింపఁబడు చుండెను. వీరేశలింగముగారి రచనములు, విద్యార్థి సభ్యులమగు మా వ్యాసములు నందుఁ బ్రచురమగుచువచ్చెను. మాయభిప్రాయము లిపుడు లిఖితరూపముఁ దాల్చుటచేత, మే మెక్కువ జాగరూకత నలవఱుచుకొంటిమి. పత్రికాపాఠకుల నోళ్ల కెక్కి, ప్రజలవ్యాఖ్యానములకు గుఱి యగుచుండుటచేత, మాకు ధైర్యసాహసాదులు పట్టుపడెను. ఇపుడు ప్రార్థనసమాజము, వారమున కొకమాఱు ప్రార్థనలు చేసికొనుటకుఁ గూడుచుండెడి వట్టి భక్తసమావేశము కాక, ఒక శాశ్వత సంస్థక్రింద నేర్పడెను. ఆ సమాజమువారి ప్రార్థనలు నుపన్యాసములు మున్నగు కార్యక్రమమంతయును బత్రికల కెక్కుచు, లోకులవాద