పుట:2015.373190.Athma-Charitramu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 144

టయె దుర్లభ మయ్యెను. ఒకటి రెండు నెల లై నపిమ్మట, వీరేశలింగముగారు నాతో పత్రికనుగుఱించి మాటాడుచు, ఒకసంచికలో వేయుటకు కార్యనిర్వాహక సంఘమువా రేర్పఱిచిన వ్యాసములలో నేను వ్రాసినది యొకటి తప్ప మిగిలిన వన్నియును పనికిమాలిన వగుట చేత, వానినిఁ ద్రోసివేసితి నని యాయన చెప్పెను ! నెల నెలయును వ్యాసనిర్ణయమునకై నేను బడెడిశ్రమ నంత పంతులుగారికి నివేదించి, పత్రికమూలమున సమాజమిత్రుల యాదరణమును గోల్పోయి, వారి యసూయకుఁ బాల్పడుచుంటి నని నేను మొఱలిడితిని. పత్రికాధిపత్యము నేనె వహించితిని గాన, ఇతరులసాయ మున్నను లేకున్నను, మంచి వ్యాసములు వ్రాసి యిచ్చుచుండుట నావిధి యని పంతులు వక్కాణించెను. ఇంతియ కాదు. తమపనులు చేయ నసమర్థులగు కార్యనిర్వాహకసంఘమువారి సభలు సమకూర్చుటయందు కాలము వ్యర్థము చేయక నేనె వ్యాసనిర్ణయము చేయవచ్చు ననియు, ఈ పనిలో తమరు నాకు సాయము చేతు మనియు, పంతులుగారు చెప్పివేసిరి ! పత్రికాసంపాదకత్వమునకు వలయుస్వాతంత్ర్య మందు వలస నాకు సమకూరెను.

పత్రికలో నింగ్లీషువ్యాస లుండుటకు పంతులుగారు మొదట సమ్మతింపకున్నను, అవి లేనిచో నెవరికిని పత్రిక రుచింపదని నేను నొక్కి చెప్పుటచేత, దీనికిని వా రొప్పుకొనిరి. కావున మొదటినుండియు సత్యసంవర్థనిలో తెలుఁగు వ్యాసములతోపాటు ఇంగ్లీషురచనములును నుండుచువచ్చినవి. విద్యార్థి నగునే నాంగ్లభాషలో వ్యాసరచన చేయుటకు మొదట భయపడెడివాఁడను. మాకాంగ్లేయపండితులగు స్కాటుదొరగారు మిగుల దయతో నాయింగ్లీషువ్యాసములు దిద్దుచుండెడివారు. మొట్ట మొదట నేను రెండుభాషలలోని