పుట:2015.373190.Athma-Charitramu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 104

చేసికొని భోజనము చేసి పాఠశాల కేగవలసివచ్చుటచేత, మా కెంతో కష్టముగ నుండెడిది. వీనికిఁదోడు, సంస్కారప్రియులగు మిత్రుల సందర్శనసంభాషణములు నా నిత్యానుష్ఠానములో నంతర్భాగములె ! ఇంట పాఠములు దిట్టము చేసికొనుటకే మాకు వ్యవధి చాలకుండెను. ఈమధ్యగ భోజనసదుపాయము లేమింజేసి మాతమ్ముఁడు కృష్ణమూర్తి జబ్బుపడియుండెను. ఆసమయమందు మా యలజడి మఱింత హెచ్చియుండెను. మా స్నేహితు లా దినములలో సంస్కరణము పట్ల చూపిన యశ్రద్ధ మిగుల నిరుత్సాహకరముగ నుండెను. అద్దానిని గుఱించి రాజగురునితో నేను మొఱపెట్టఁగా, దీనివిషయమై మా సంస్కరణసభలో నొకనాఁ డాతఁడు తీవ్రముగ మాటాడెను. కనక రాజు ఆమాటలకుఁ గుపితుఁడయ్యెను. పాపయ్యగారు పలికిన చల్లని పలుకులును, వీరేశలింగముగారి సంస్కరణోపన్యాసమును ఆతని కోపము నొకింత చల్లార్చెను.

సంస్కరణసమాజకార్యక్రమమే నా యసంతుష్టికి హేతువయ్యెను! ఈసమాజమున కాస్తికమతముతో సన్నిహితసంబంధము గలసినఁగాని దీనికి మోక్షము లేదని నానిశ్చితాభిప్రాయము! 27 వ జూలై తేదీని జరిగిన సంస్కరణసభకు లక్ష్మీనారాయణగా రగ్రాసనాధిపతి. సంఘసంస్కరణమునుగుఱించి కష్టపడి వ్రాసినవ్యాసము నేను జదివితిని. భీమశంకరము వ్యతిరేకాభిప్రాయ మిచ్చినను, కనక రాజు నాకు సానుభూతిఁ జూపెను. 3 వ ఆగష్టున జరిగినసభకు నే నగ్రాసనాధిపతిని. వివాహమునుగుఱించి కృష్ణమయ్యంగారు వ్యాసము చదివిరి. మిక్కుటమగు సభాకంపమునకు లోనైనను, నే నెటులో నావిధులు నిర్వర్తించితిని. మాటలకొఱకు నేను తడవికొనుచువచ్చితిని. నా యుపన్యాస మతిదీర్ఘముగ నుండెను. అంత్యోపన్యాసము ముగించి