పుట:2015.373190.Athma-Charitramu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 72

భూతిఁ జూపుచువచ్చెను. కాని, యాచారసంస్కరణవిషయమై శాంతనార్గ మవలంబనీయ మని నా కాతఁడు హితవు చెప్పుచుండెడివాఁడు. దురాచారమును ఆగర్భశత్రువుగఁ జూచుచుండెడివాఁడను నేను. ఎట్టిదురాచారనిరసనమందైన, మనశ్శాంతిని గోలుపోక, కుటుంబ సౌఖ్యమును, సాంఘికసామరస్యమును జెండాడవల దని బోధించు చుండువాఁ డాతఁడు. మాయాసంస్కరణవ్యాసంగమునఁబడి యారోగ్యముఁ బోగొట్టుకొనుచుంటి నని శాస్త్రి మున్నగు స్నేహితులు నన్నుఁ బలుమాఱు హెచ్చరించిరి. మా పెద్దతమ్ముని పెండ్లిమాట లిపుడు జరుగుచుండెను. ఇపుడు వివాహము వలదని నే నింట తలిదండ్రులతో మిక్కిలి పట్టుదలతో వాదించుచుంటిని. నా తీవ్రవాదన యర్థము సరిగా లోకులు గ్రహింపక, లేనిపోనియుద్దేశములు నా కారోపింతు రనియు, కాన, నేను గడుసుఁదనమున మితభాషిత్వ మూమటయె శ్రేయ మనియు వెంకటరావు నాకు బోధనఁజేసెను.

30 - 3 - 90 తేదీన సంస్కరణవిషయమై ముత్తుస్వామిశాస్త్రికిని నాకును దీర్ఘ సంభాషణము జరిగెను. సంస్కరణముల నాచారణమునఁ బెట్టుటయందు భార్యసానుభూతిసాహాయ్యము లత్యంతావశ్యకము లని యతఁడు చెప్పెను. హిందూయువతులకు పాతివ్రత్య మనునది యమూల్యాభరణము. దాని నూఁతగాఁ గొని, పురుషుఁడు స్త్రీపై నిరంకుశాధికారము చెల్లింపవచ్చును. క్రొత్తగఁ గాపురమునకు వచ్చిన భార్య నొకసారిగాఁ దనసంస్కరణమహార్ణవమున ముంపఁబూనక, సంస్కరణపక్షమునం దామె కభిరుచి పుట్టించుటకై సంస్కర్త మెల్ల మెల్లగ ప్రబోధము గావించుచుండవలెను. తలిదండ్రులయెదుట నైనను మన సంస్కరణతీవ్రతను జూపింపక, విచారపూరితమగు మన మౌన మితభాషిత్వములుచూచి వారు ప్రశ్నింపఁగా, అపుడు