పుట:2015.373190.Athma-Charitramu.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మచరిత్రము 68

"31 - 12 - 89 : - దయామయుఁడవగు తండ్రీ ! నేను ఈ సంవత్సరారంభమున, స్థిరసంకల్పము గాని, దృఢవిశ్వాసము గాని లేకుండెడియువకుఁడను. ఇపు డేస్థితిలో నున్నాను ? అజ్ఞానతిమిరము నుండి నీ జ్యోతిర్మయమండలమువైపున కొక యంజ వేసితిని. ఈ వత్సరమున శరీరమందును, మనస్సునందును, ముఖ్యముగ నీతివిషయమునను, నే నెన్నియో మార్పులు చెందినాఁడను. సత్ప్రవర్తనమున నేనీ వత్సరమున నుచ్చదశ ననుభవించితిని. మనుజుని సచ్ఛీలతా సత్ప్రవర్తనములు దేవదేవునికిఁ బ్రియతమము లని తుదకు నేను గనుగొంటిని." *** "1 - 1 - 90 : - 'సర్వసమర్థుఁడా ! నాశత్రువులనుండి నన్ను రక్షింప నీవే యోపుదువుగాని, కడు దుర్బలుఁడ నగునేను గానుసుమీ !, యని ప్రారంభప్రార్థన సలిపి, నూతనసంవత్సరమున నేను జెల్లింపవలసిన విధులనుగూర్చి యోజించితిని. ప్రథమశాస్త్రపరీక్షకు బాగుగఁ జదువవలె ననియు, తమ్ములయొక్కయు చెల్లండ్రయొక్కయు విద్యాపరిపోషణముఁ గావింపవలె ననియు, పరిశుద్ధాస్తికమతప్రచారము సలుపవలె ననియు, నేను కృతనిశ్చయుఁడ నైతిని. విధికార్య నిర్వహణవిషయమున నే జేసికొనిననియమములఁ గొన్ని యిచట నుదాహరించుచున్నాను : -

1. శరీరసాధకమునుగూర్చి ముఖ్యముగ శ్రద్ధ వహింపవలెను.

2. కోపము, గర్వము, అసూయ, లోభము - వీని నదుపులో నుంచవలెను.

3. ప్రేమ, మతోత్సాహము మున్నగువానిపట్ల మితి మీఱరాదు.