పుట:2015.373190.Athma-Charitramu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18. నూతన దృక్పథము 67

నాకు నీయెడఁగల ప్రేమాతిశయము నెట్లు నీ కింక వ్యక్తపఱుపఁగలను ? ఎవ్విధమున నీస్మారకచిహ్న మిచట నెలకొల్పనగును ?"

18. నూతన దృక్పథము

నూతన మతాన్వేషణమునుగుఱించి 1889 వ సంవత్సరమధ్యమున నాకుఁ గలిగిన యుత్సాహోద్రేకములు, ఆ సంవత్సరానంతరము వఱకును నా మనస్సును గలఁచివైచినవి. ఇదమిద్ధ మని నేను నమ్మవలసినది వైష్ణవమా క్రైస్తవమా, సంస్కరింపఁబడిన హిందూమత ధర్మములా, ప్రార్థనసమాజవిధులా; - యని నే నా యాఱునెలలును తల్ల డిల్లి తిని. ఈవిషయమై సత్యనిరూపణము చేసికొనుటకు స్నేహితులతోఁ జెలిమి చేసితిని, సావాసులతోఁ జర్చలు సలిపితిని, సభలలో నుపన్యాసములు వింటిని, సద్గ్రంధపఠనముఁ గావించితిని. వీనియన్నిటి పర్యవసానము, ఆ సంవత్సరాంతమున నేను బ్రాహ్మమతధర్మవిశ్వాస మలవఱచుకొంటిని. అప్పటినుండియు నేను మతాన్వేషణమునకై మరల తత్తరపడలేదు. ఉన్నతపర్వతాగ్రమున నిర్మితమగు గృహరాజమువలె, నామతవిశ్వాసము లింతటినుండి స్థిరములు సుందరములునై విరాజిల్లెను. మతగ్రంథపఠన మతపరిశోధనములు చేయుటకును, ఆత్మాభివృద్ధి ఆత్మపారిశుద్ధ్యములు గాంచుటకును వలసిన పరిశ్రమము ఇంతటితో నంతరించిన దని నేను జెప్పుటలేదు. వీని యన్నిటికిని మఱింత యనుకూల మగు నావరణ మేర్పఱిచెడి దృఢత్వ స్థిరత్వములు నా మతవిశ్వాసముల కిపుడు లభ్యమయ్యెననియే నేను జెప్పుచున్నాను.

నా దృష్టిపథమునఁ గలిగిన యీపెద్దమార్పు, 1889 డిశంబరు 31, 1890 జనవరి 1 వ తేదీలదినచర్యలలో స్పష్టముగ వివరింపఁబడెను. అందలి ముఖ్యభాగము లిచట నుల్లేఖించుచున్నాను : -