పుట:2015.372412.Taataa-Charitramu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'తాతాఎయిర్వేసు' అనబడు ఆకాశవిమానసంఘమును ఇటీవల ఈసంఘమువారి సహాయమున ఆరంభమైనదే. తాతా కరాచీ బొంబాయిలనుండి హైదరాబాదుగుండ మన మద్రాసు ప్రాంతముకు, తిరువాన్కూరుకు, ఈకంపెనీవారు విమానములను నడుపుచున్నారు. తాతాకంపెనీలు చేయు వ్యాపారము లింకను కొన్నికలవు.

మనదేశపు పారిశ్రామిక సంస్థలట్టిలో తాతాకంపెనీయే ప్రధానము. జంషెడ్జితలపెట్టి స్థాపించినవానిని వారు వృద్ధినొందించినారు; క్రొత్తపరిశ్రమలను స్థాపించుచున్నారు. ఇతరపరిశ్రమికులతో సృహృద్భావముకలిగి, దేశపు ఆర్థికసంపత్తిని పెంపొందించుచున్నారు. ఆకంపెనీలో పుంజీపతులకుండు కొన్నిలోపము లున్నను, అనేకసుగుణములును కలవు. ప్రస్తుతము తాతాకంపెనీలు రమారమి నూరుకోట్లరూపాయల మూలధనముతో వివిధప్రాంతములందు చాల పరిశ్రమల స్థాపించి నడుపుచున్నారు. వంగదేశము మొదలు మళయాళ ప్రాంతమువరకు దేశమంతటను వీరి కార్ఖానాలు పనిచేయుచున్నవి. ఇందు రమారమి మూడులక్షలజనులు పనిచేయుచున్నారు. ఇందుకొంతమంది విద్యావంతులకు, ప్రభుత్వోద్యోగమునందుకన్న, హెచ్చు జీతములుండును. ప్రపంచమందలి ముఖ్యదేశము లంతటను వీరి కార్యాలయము లున్నవి. అంతర్జాతీయముగను దీనికి చాల ప్రసిద్ధి ప్రాముఖ్యము కలవు. వీనికన్నిటికిని మన కధానాయకుడగు జంషెడ్జితాతాయే బీజమని చెప్పవచ్చును.