పుట:2015.372412.Taataa-Charitramu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిచ్చుట, అంగవైకల్యమువలన నశక్తులగువారికి సొమ్మునిచ్చుట, జలాగ్నిప్రమాదములకు లోనగు భవనములు ఓడలు సరుకులు మున్నగువానికిని భీమాపట్టుట, ఇట్టివిందు కలవు. ఇవి పెద్ద వర్తకులకు, వ్యాపారస్తులకు, కార్మికులకును, చాల వినియోగించును.

ఇట్లే కొబ్బరినుండి వివిధవస్తువుల జేయుటకు, 'తాతా ఆయిల్‌మిల్స్ కంపెనీ' అనుసంఘము స్థాపింపబడినది. మనదేశపు వివిధప్రాంతములందు చిరకాలమునుండి కొబ్బరితోటలు విశేషముగ గలవు. ఈతోటలు కొన్ని మనము కాయలదినుటకును, తక్కినవన్నియుకల్లుగీతకును ఉపయోగపడుచున్నవి. కొబ్బరియు, ఇంకను ఇతరవిధములగు చమురుగింజలును, చాలవరకు విదేశముల కెగుమతి యగుచున్నవి. అట్లుగాక కొబ్బరినుండి చమురుగింజలనుండి ఈకంపెనీవారు వైజ్ఞానికపద్ధతులచే చిరకాలము నిలవయుండు పరిశుద్ధమగు నూనెలను, ప్రశస్తమగు చాలరకముల సబ్బులను చేయుచున్నారు. మరియు ఈకొబ్బరిసారము శుద్ధిజేసి 'కోకోజెం' అనబడు చౌక నేతినిగూడ చేయుచున్నారు. మనము మామూలుగ వాడు నేయి శాకాహారము కాదు; అది పశుసంబంధము. అట్లుగాక 'కోకోజం' కేవలము వృక్షసంబంధము ఈకంపెనీవారు బట్టలసబ్బులు మున్నగు చాలరకముల వస్తువుల జేయుచున్నారు, అవి చౌకవి; అని విదేశపువాని కెందును తీసిపోవు.