పుట:2015.372412.Taataa-Charitramu.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోవుటయు గూడ, మనము గమనించియున్నాము. ఈకాలమందే ఆయన బెంగుళూరు ప్రాంతమున పట్టుపరిశ్రమను స్థాపించి, దానిని జయప్రదముగ జేసెను; మామిడిపండ్లను చెడకుండ మంచులో నిలవజేసి వానిని విదేశములకు యెగుమతిచేయుట, జలనుండి గొట్టములద్వారా నూతులకు నీరు రప్పించుట, మున్నగు కొన్ని యితరవ్యాపారముల ప్రయత్నమును గూడ ఆయన చేయుచుండెను. ఆవ్యాపారము లిప్పుడీదేశమున లాభకరముగ జరుగుచున్నవి. వీనిని మొదట ఆరంభించి మార్గదర్శకుడైనది తాతాగారే.

1898 నుండి, ఆయన మనదేశపు ఆర్థికసౌభాగ్యమున కవసరమగు విజ్ఞానాలయము, లోహపరిశ్రమ, జలవిద్యుచ్ఛక్తి, ఈమూడింటిస్థాపనయందును ప్రత్యేకదీక్ష వహించి, వానికై నిరంతరము కృషిచేసెను. ఈమూడును చాల గొప్పసంస్థలు, ఇదివరలో మనదేశమున నిట్టివి లేవు. వీనికి సంబంధించిన అనేక విజ్ఞానవిషయములను సమస్యలను పరిష్కరించుటకు ప్రతిభ, విశాలజ్ఞానము, అమితచాతుర్యము, నిరంతరశ్రమ, దూరదృష్టి, అవసరములు.

ఆయన యీమహాసంస్థల స్థాపనకై మనదేశపు వివిధప్రాంతములను జగద్విఖ్యాతులగు విజ్ఞులచేత, విశేషవ్యయముకోర్చి, పరిశోధింపజేసెను; స్వయముగా యూరపు అమెరికాలకు చాలసారులు వెళ్ళి, అచట పరిస్థితుల గ్రహించి,