పుట:2015.372412.Taataa-Charitramu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈలోగా మనదేశమున హఠాత్తుగ 'స్వదేశీ' ఉద్యమ మారంభించెను. ప్రభుత్వమువారు 1905 లో వంగ రాష్ట్రమును రెండుగా విభజించిరి. ఈవంగభంగముకు ప్రజలిష్టపడక, దానిని రద్దుచేయించుటకై తీవ్రముగ ఆందోళన నారంభించిరి. అప్పుడే పాశ్చాత్యమహా సామ్రాజ్యమగు రష్యాను ప్రాచ్యులగు జపానీయు లోడించిరి. అందుచే భారతీయులలో గూడ ఆత్మవిశ్వాసము, జాతియోత్సాహమును, ప్రబలెను. పాశ్చాత్యదేశములనుండి దిగుమతియగుచున్న సరుకులగొనుట తగ్గించి, 'స్వదేశీ' య వస్తువులనే కొనవలెనని, సాధ్యమైనంత వరకు పరిశ్రమలను మనదేశమందే స్థాపించుచు, అవసరమగు వస్తువుల నీదేశమందే తయారుచేసుకొనవలెననియు, దేశమంతట నుద్బోధము కలిగెను; విద్యావంతులలో నుత్సాహము వ్యాపించెను. ఆయుద్రేకమువలన మనదేశీయులే దొరాబ్జికి తోడ్పడిరి. ఆయన జారీచేసిన ప్రకటనప్రకారము రు. 2,31,00,000 లును భారతీయులనుండియే సమకూడెను. అందుతో "తాతా ఐరన్ అండ్ స్టీల్ వర్క్సు" అను పేర వాటాదార్ల జాయింటుస్టాకు కంపెనీ యేర్పడెను. తాతా కంపీనీవారే దీని నియంతలు; దొరాబ్జితాతా యధ్యక్షుడు, నరోత్తమగోకులదాసు, విఠల్‌దాస్ థాకర్సే, కొవాస్జి జహంగీరు మున్నగువారు డైరక్టర్లును, అయిరి. అందు చాల వాటాలను తాతా బందుమిత్రులు తీసుకొనిరి.