పుట:2015.372412.Taataa-Charitramu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంతట తాతాకంపెనీవా రీలోహపు కార్ఖానాల గట్టుట కుచితస్థానము వెదకి, తుదకు బిహారురాష్ట్రపు మానభూమిజిల్లాలో, 'సాక్షి' అను కుగ్రామపు స్థలమును నిర్ణయించిరి. ఇది బెంగాలు నాగపుర రైలులైనుకు సుమారు రెండుమైళ్లలో నున్నది. ఆప్రాంతము వనమయము, సుందరము, కొండ నేలయగుటచే, అందు భవననిర్మాణము సుకరము, కావలసినంత విశాలస్థలము చౌకగ దొరకును. ఇది కలకత్తా రేవుకు 150 మైళ్లలో నుండును. అచటనే రైలుమార్గ ముండుట యెగుమతికి లాభకరము. అచటి రైలుస్టేషను అగు కలిమాటి *[1] నుండి 2 1/2మైళ్లును, గురుమైశిం ఇనుపగనులకు 40 మైళ్లును, రైలులైను వేయబడినది. ఈరైలులైనులను తాతాకంపెనీ వారే నడుపుకొందురు. దక్షిణమున ఇనుపగనులు, ఉత్తరమున తూర్పున బొగ్గుగనులు, పడమట సున్నపురాళ్ల దిబ్బలు, వీనిమధ్య నీస్థలము జీవనదియగు 'సువర్ణ రేఖ' తీరమందున్నది. ఇచట సంతాలులు మున్నగు దృఢగాత్రులగు అడవిజనులు కొద్దిమంది కలరు. వీరిభాష ప్రాచ్యహిందికి ఉపశాఖ; ఇచట యంత్రాలయపు నిర్మాణము 1908 లో ఆరంభించెను.

పనివాండ్రకు వీలైనంతవరకు శ్రమతగ్గుటకై, బలువుపనులన్నిటికి నవీనపద్ధతివగు ప్రశస్తయంత్రములను జర్మనీ, అమెరికా,

  1. * ఈస్టేషను పేరు తరువాత 'తాతానగర్‌' అని, అచటవృద్ధియైన తాతానగరము పేరుగ, మార్చబడినది.