పుట:2015.370800.Shatakasanputamu.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. విగతక్లేశులు వీతకిల్బిషమయుల్‌ విజ్ఞానవిద్యానిధుల్‌
     నిగమార్థజ్ఞులు నిశ్చలవ్రతయుతుల్‌ నిర్వ్యాజనిష్ఠాయుతుల్‌
     సుగుణుల్‌ సూనృతవర్తనుల్‌ శుభకరుల్‌ శుద్ధాంతరంగుల్‌ శుభుల్‌
     జగతీమండలి నీదుసేవకులు కృష్ణా! దేవకీనందనా!88
శా. దీనుల్గల్గిన నీదు రక్షణగుణాధిక్యంబు రాణించు నౌ
     దీనుండెవ్వఁడు లేఁడు నీదుకరుణాదృష్టిన్‌ గృతార్థుల్‌ జుమీ
     నేనే దీనుఁడ నన్నుఁ బ్రోవు శరణంటిం ద్వన్ముఖోదీర్ణ సు
     జ్ఞాన శ్రీకరమూర్తి నమ్మితిని కృష్ణా! దేవకీనందనా!89
శా. పాత్రాపాత్రవివేకము ల్సమసె పాపం బెచ్చె ధర్మంబునున్‌
     మిత్రఘ్నత్వము కల్లలాడుటయు స్వామిద్రోహముం గొండెమున్‌
     ధాత్రిం బూజ్యము లయ్యె సజ్జనులచందం బెట్లు రక్షించెదో
     సత్రాజిత్తనయా మనోరమణ కృష్ణా! దేవకీనందనా!90
మ. అరయన్ [1]శంతనుపుత్త్రుపై విదురుపై నక్రూరుపైఁ గుబ్జపై
     నరుపై ద్రౌపదిపైఁ గుచేలకునిపై నందవ్రజస్త్రీలపైఁ
     బరఁగంగల్గు భవత్కృపారసము నాపైఁ గొంతరానిమ్ము మీ
     చరణాబ్జంబుల నమ్మినాఁడ హరి కృష్ణా! దేవకీనందనా!91

  1. చందనగంధిపై