పుట:2015.370800.Shatakasanputamu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. జపముల్‌ సేయఁగ నేర నీమమున నిచ్చ ల్పూజ సేయంగలే
     నుపవాస వ్రతభక్తి చొప్పెఱుఁగ వేదోక్తక్రమస్థుండఁగా
     నపరాధంబులు నాయెడం దఱచు నే నజ్ఞాని నెబ్భంగులన్‌
     జపలుం డంచు నుపేక్ష సేయకుము కృష్ణా! దేవకీనందనా!8
మ. సుకరంబై సురసేవ్యమై సులభమై సువ్యక్తమై యుక్తమై
     ప్రకటంబై పరమార్థమై ప్రమదమై ప్రద్యోతమై పథ్యమై
     యకలంకామృతమై యమోఘతరమై యానందమై యందమై
     సకలంబున్‌ భరియించు మీమహిమ కృష్ణా! దేవకీనందనా!9
శా. కొండల్వంటి కవీశ్వరుల్‌ శతకము ల్గూర్పంగఁ గోటానకో
     ట్లుండన్‌ నీవును జెప్పఁబూనితి వదేమో యంటివా వింటివా
     వండేనేర్పులఁ బెక్కురీతుల రుచుల్‌ వర్తింపవే శాకముల్‌
     దండిన్‌ నామన వాలకింపు మదిఁ గృష్ణా! దేవకీనందనా!10
శా. చన్నే నిన్నును బాలుఁగాఁ దలఁచి యిచ్చం బూతనాకాంత దాఁ
     జన్నుల్నిండఁగఁ జేఁదుఁ బూసికొని యా చన్బాలు నీకిచ్చినం
     జన్నుంబాలకు లోనుగాక యసురన్‌ సాధించి యాయింతికిన్‌
     సన్నన్‌ ముక్తి యొసంగితీవు భళి కృష్ణా! దేవకీనందనా!11
మ. విలసిల్లన్‌ పదియాఱువేలసతులన్‌ వీక్షించి వారిండ్ల లో