పుట:2015.329863.Vallabaipatel.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వల్లభాయిపటేల్

39

భూములను దిరిగి ప్రాతఖామందుల కిచ్చి వేసిరి. రైతులు తిరిగి తమ పిత్రార్జితములను బొందగలిగినందుల కానందభరితు లగుచున్నారు. కాంగ్రెసువారు తాము వెనుకఁజేసిన వాగ్దానములను జెల్లింపఁగల్గినందులకును సంతసింపవలసియున్నది. కాంగ్రెసుచేసిన శపధము నెగ్గితీరు నను విశ్వాసము ప్రజలలోఁ బ్రబలుట కవకాశముకలిగినది. ఇట్లే నాన్-కోఆపరేషనులో గ్రామోద్యోగిపదవులనుండి భ్రష్టులైనవారిని దిరిగి స్వపదస్థులుగఁ జేసినందులకు మద్రాసు ప్రభుత్వమువారును వంద్యులు. వెనుకటి ప్రభుత్వము వారొనర్చిన యపచారములను గాంగ్రెసు మంత్రులు తొలగింప సమకట్టినను, బొంబాయి, మద్రాసు గవర్నరు లడ్డుపడక, వారి కర్తవ్య పరిపాలనకుఁ దోడ్పడఁగల్గుట యెంతయుఁ బ్రశంసింపఁదగిన విషయము. నేటికి బార్డోలీ వీరుల కథ యిట్లు మంగళకరముగ ముగిసినందులకు దేవతలు హర్షించెదరు. సత్యాగ్రహమునం దెట్టి దివ్యశక్తికలదో యిప్పటికిఁ బూర్తిగ విశదమైనది."

భాషా సేవ

సాంఘిక వ్యవస్థనుబట్టి భాషాస్వరూప మేర్పడును. రాజకీయ చైతన్యమునుబట్టి ప్రజలకుఁ బ్రభుత్వమునకు గల పద్ధతులు, సంబోధనలు, మాఱుచుండును. ప్రజాస్వామికము పెరిగినకొలది ప్రజాస్వామికభాష బాగుగా నభివృద్ధి చెందును. ఇందులోఁ బూర్వయుగములోవలె యజమాని, బానిస లని, పాలక, పాలిత భేదము, హెచ్చు తగ్గులు, లేక సామాన్య ప్రతిపత్తి చూపఁబడును.