పుట:2015.329863.Vallabaipatel.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140

వల్లభాయిపటేల్


ఐక్య మవసరము

ఇంతటి విభిన్నదృక్పథములుగల వ్యక్తు లనేకసమస్యలపై భిన్నాభిప్రాయములు కలిగియుండకపోవుట యాశ్చర్యముగా నుండఁగలదు. వాస్తవమునకు వారిద్దరు నొకరిసూచనల నొక రనేకపర్యాయములు తీవ్రముగాఁ బ్రతిఘటించుకొనిరి. ఇది స్వాభావికమే. కాని దేశభవిష్యత్తు తామిద్దరుఁ గలసి పని చేయుటపైనే యాధారపడియున్నదని వారు గ్రహింపవలెను. గాంధీజీ హత్యానంతర మీ విషయము మఱింత ప్రాముఖ్యము వహించినది. చాలమంది యాశించినదానికి విరుద్ధముగా వా రిద్దరుఁగలసి పనిచేయఁగలిగిరి. అంతేగాక యీ సమయమున విడిపోవలెనని వారు కోరుకొన్నను విడిపోఁగలరా యన్నది సందేహాస్పదమే. వారిద్దరు విడిపోవుట ప్రస్తుతానిశ్చిత వాతావరణములో నొక పెద్ద సంక్షోభమునకు దారిదీసి, యెట్టి విషమపరిణామములనైనఁ గలిగించవచ్చుననుట నిస్సందేహము. కొంతమంది యవకాశవాదు లొకరియెదుట రెండవ వారిని దూషించి, తాము లాభము పొందవలెనని, యోచించుచు, వీరిద్దరిమధ్య విభేదములను వృద్ధిచేయుచున్న మాటకూడ వాస్తవమే.

రాజకీయచరిత్రలో నింతటియాశ్చర్యకరములు, విభిన్నాత్మకములైన 'కూటములు' లేకపోలేదు. రాజకీయవేత్తలకు భేదాభిప్రాయము లుండెడివి. ఇకముందు నుండఁగలవు. అందు వలన వారొకే యాదర్శముకొఱకుఁ గలసికట్టుగాఁ బనిచేయ లేకపోలేదు. పటేల్ - నెహ్రూ లిప్పటివఱకుఁ బోరాడుకొను చుండవచ్చును. కాని తాము కలసి పనిచేయక తప్పదని