పుట:2015.329863.Vallabaipatel.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

వల్లభాయిపటేల్

లలో బ్రిటిషు ప్రభుత్వము భారతపరిపాలనను దేశీయుల కొప్పగించును. హిందువులు ముస్లిములు హెచ్చుగానున్న రాష్ట్రములలో రెండు కేంద్రప్రభుత్వములు నెలకొల్పఁబడును. ఈ కేంద్ర ప్రభుత్వముల రెంటికి నధినివేశస్వాతంత్ర్య మీయఁబడును. ఇవి తమకిష్టమగుచో బ్రిటిషు రాజకూటములో నుండవచ్చును; లేకున్న స్వతంత్ర రాజ్యములుగ నిర్ణయించుకొని వేఱుపడ వచ్చును. స్వేదేశసంస్థానములు స్వతంత్రములగును. అవి యే యధినివేశములో నైనను జేరవచ్చును. కానిచో బ్రిటిషు ప్రభుత్వముతోఁ బ్రత్యేకముగా నొడంబడిక చేసికొనవచ్చును.

ఈ దేశ విభజనపద్ధతికిఁ దొలుదొలుత కాంగ్రెసు వారంగీకరించలేదు. కాని బ్రిటిషువారు ముస్లింలీగువారితో నేకీభవించి చేయుచున్న కుటిల రాజకీయ తంత్రాంగమువల్ల దేశమునఁ గల్లోలము హెచ్చుమీఱి రక్తపుటేఱులు పాఱుచుండుటచే గత్యంతరము లేక విదేశపరిపాలనవిముక్తికై యెట్ట కేల కీ విభజన సిద్ధాంతమున కిష్టపడవలసి వచ్చెను.

ఈ ప్రణాళిక ననుసరించి బ్రిటిషు ప్రభుత్వము 1947 సంవత్సరము జులై నాలుగవ తేదీని పార్లమెంటులో భారతస్వాతంత్ర్య శాసనమును బ్రతిపాదించెను.

ఈశాసనము ప్రకారము భారతదేశము విభక్తమై యధినివేశములుగా నేర్పడెను.

మద్రాసు, బొంబై, మధ్యరాష్ట్రము, సంయుక్త రాష్ట్రము, ఒరిస్సా, తూర్పుపంజాబు, పశ్చిమబెంగాలు, బీహారు, అస్సాం, (సిల్హటు జిల్లా మినహాః) ఈ రాష్ట్రములతో ఇండియన్ యూనియ నేర్పడి దానికి రాజధాని ఢిల్లీ కాఁగలదు.