పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

విశ్వనాథనాయకుఁడు

అప్పుడు కుమారుఁడు తన తండ్రి సజీవుఁడై యుండఁ బట్టువడుట తన యదృష్టముగా భావించి సంతోషముతో నతని నొక యంబారీమీఁద నెక్కించి వానిచుట్టును తనపారాకడాయించి విజయనగరమునకుఁ గొనిపోవుచు యావద్వృత్తాంతమునుఁ బూసగ్రుచ్చినటుల యొక జాబులో లిఖించి ముందుగా నాలేఖను రాయలవారికిఁ బంపించెను. కృష్ణదేవరాయలవా రాలేఖను గాంచి యపరిమితానందమునుఁ జెంది యానాఁడు సేనానాయకుల నెల్లరను రప్పించి వారలతో నిట్లు పలికెను.

"విశ్వనాథనాయఁడు స్వామికార్యము నెట్లు నిర్వహించుకొని తనప్రతిజ్ఞను మఱువక తనతండ్రిని సజ్జివునిగాఁ జెఱపట్టి దర్బారునకుఁ గొనివచ్చు చున్నాఁడో విన్నారు గదా? నాఁడు మీ రెల్లరును నాగమనాయనికి వెఱచి యీ మహాకార్యము నిర్వహింప శక్తి చాలనివార మని చెప్పఁగా యువకుఁ డగువిశ్వనాథనాయఁడు తాను నిర్వహింతునని లేచినపు డాతఁ డెందఱపరిహాసములకుఁ బాత్రుఁడు కాలేదు? ఇతరులప్రశంస యెందుకు? మాకే సంశయము కలిగినది. ఇదిగో నేఁ డతఁడు మాపేరవ్రాసి పంపించినజాబు".

అని యాజాబును దనకొల్వుకూటమున నున్న వారి కెల్లరకుఁ దెలియునట్లుగాఁ జదివింపఁ జేసెను. ఎల్లవా రాశ్చర్య నిమగ్నులైరి. ఇతఁడు మనుష్యమాత్రుఁడుగాఁ గన్పట్టఁడు. కేవలము విశ్వనాథుఁ డీరూపమున నవతరించి