పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వనాథనాయకుఁడు

13

యుండఁబోలు" నని బహువిధముల నాతని శ్లాఘించిరి. కృష్ణదేవరాయలవారు తనసంతోషమును బట్టజాలక యిరుబుజములు పొంగిపోవుచుండ "ఓహో! ఇటువంటి బంటునకు నేలికనై యుంట నేను ధన్యాత్ముఁడ నగుటచేతనేగదా సంభవించెను! మీవాక్కులు నిక్కువములు. ఆతఁడు మనుష్యులలోఁ బరిగణింపఁ దగినవాఁడు గాఁడు. ఇతఁ డొకనాడు అడవి దున్నపోతును నఱకి నాప్రాణమును రక్షించినవాఁడు. ఇటువంటి మహాపురుషునిచేత నింకఁ గొలువు చేయించుకొనుట మహాదోషముగాఁ గన్పట్టుచున్నది. ఈతని కెదియైన రాజ్యము నొసంగి నాతో సమముగాఁ గూర్చుండబెట్టికోఁ దగినవాఁ డని మనంబునకు దృఢముగాఁదట్టుచున్నది." అని స్పష్టముగా నిండుకొల్వున బలికెను. అంత సభవా రిట్లేకగ్రీవముగాఁ బలికిరి.

"స్వామీ! విశ్వనాథనాయనికి రాజ్యపేక్ష లేదు. ఉన్నచో నాతఁడు తండ్రితో నేకమై మన మీఁదికి దాడిచేసియే యుండును. అపుడు వారిని మనము జయించుటయు సుసాధ్యము గాకుయుండును. అతఁడు విశ్వేశ్వరాంశ సంభూతుఁడు గనుకనే విద్వౌసపాత్రుఁడై స్వామికార్యమును నిర్వహించుకొని వచ్చు చున్నాఁడు. ఈ కలికాలమున నిట్టి వీరకృత్యములను వినఁజాలము, కనఁజాలము. తలపోసినకొలఁది మా కెంతయు నచ్చెరువు గలుగుచున్నది. దేవరవారు సర్వజ్ఞమూర్తులు. తమకుఁ దెలియనియంశ మేమి గలదు. దేవరచిత్తము వచ్చినట్లు గావింపుఁడు."