పుట:1857 ముస్లింలు.pdf/41

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రాంతాలలో గల ఈస్ట్‌ ఇండియా కంపెనీ పెత్తనానికి చరమగీతం పాడి ఆంగ్లేయ అధికారులను తరిమికొట్టారు. ఆయా ప్రాంతాలను ఆంగ్లేయుల ఆథిపత్యం నుండి విముక్తం చేసి స్వదేశీపాలనను ఆరంభించారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూరుకు చెందిన సర్దార్‌ హిక్మతుల్లా ఖాన్‌ 1857 జూన్‌ 10న తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఆయన ఈస్ట్‌ ఇండియా కంపెనీ లో డిప్యూటీ కలెక్టరుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆంగ్లేయుల పెత్తనాన్ని అంతం చేసి అన్ని సాంఘిక జనసముదాయాలకు చెందిన స్వదేశీయోధుల భాగస్వామ్యంతో స్వపరిపాలన ఏర్పాటు చేశారు. చేజారిన అధికారాన్ని చేజిక్కించుకోడానికి ఆంగ్లేయ సైనికాధికారులు ఫతేపూరును చుట్టుముట్టి హింసాత్మక పోరును సాగించి, కుయుక్తులతో సర్దార్‌ హిక్మతుల్లా, ఆయన సహచరులను అరెస్టు చేశారు. సర్దార్‌ను జూలై 12న బహిరంగంగా ఉరితీసి ఆయన అనుచరులలో, ప్రజలలో భయోత్పాతాన్ని కలుగచేసేందుకు ఆయన మృతదేహాన్ని ఉరికంబానికి వేలాడదీసి ఉంచారు.

బీహార్‌కు చెందిన పీర్‌ అలీ తన సహచరులతో ఆంగ్లేయ సైన్యాలపై తిరగబడ్డారు. స్వదేశీ యోధులకు తొలి దశలో విజయం లభించినప్పటికీ ఆ తరువాత అదనంగా వచ్చి చేరిన ఆంగ్లేయ బలగాలు పీర్‌ అలీనీ ఆయన అనుచరులనూ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తిరుగుబాటు రహస్యాలు చెప్పమని, అలా చెప్పినట్టయితే ప్రాణభిక్ష పెట్టగలమని ఆంగ్లేయాధికారులు పీర్‌ అలీని మాలిమి చేయసాగారు. ఈ సందర్భంగా నీచమైన పద్ధతులకు పాల్పడుతున్న బ్రిటీష్‌ సౖౖెనికాధికారులవైపు చూస్త్తూ ఆగ్రహంతో పీర్‌ అలీ ఇలా అన్నారు :

' ..ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్కసారి ప్రాణాలను రక్షించుకోడానికి తెలివిగా వ్యవహరించాల్సిన అవసరం వస్తుంది. అయితే అన్ని సమయాలలో ప్రాణాలు కాపాడు కోవటమే ప్రధానం కాదు. కొన్ని సమయాలలో ఆశయాల కోసం, మాతృభూమి గౌరవ ప్రతిష్ఠల కోసం జీవితాలను పణంగా పెట్టాల్సివస్తుంది. మాతృభూమి కోసం బలికావటం తన భూమి పట్ల గల ప్రేమకు నిదర్శనం అవుతుంది...నా సహచరులను నా కళ్ళ ఎదుటనే ఉరి తీసారు. ఇంకా చాలామందిని ఉరి తీయగలరు. నన్నూ చంపగలరు. అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. బలమైన స్వేచ్ఛా కాంక్షతో, స్వాతంత్య్రం కోసం రక్తతర్పణలకు సిద్ధమౌతున్న ఈ పుడమి తల్లి బిడ్డలను నిలువరించటం విూకు కాదు కదా మరే శక్తికీ సాధ్యం కాదు. ఈ రణంలో చిందిన మా నెత్తురు చుక్కల నుండి