పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

హిందూకోడ్ బిల్ సమీక్ష

నయిపోవును. ఎందును సిద్ధికలుగనేరదు. కావున సత్తాన్ఫూర్తి యన్నిటి యందును గలదు. సత్తాస్ఫూర్తులయందే సర్వము నిమిడియున్నది. అదియే సర్వాధిష్ఠానము, సర్వకారణము, సర్వప్రకాశకమునుఉపాదాన నిమిత్తములు కూడనదియే. కావుననే వేదాంతమందు అభిన్నోపాదాన నిమిత్త కారణత్త్వము సిద్ధాంతీక రింపబడినది, అట్టి కారణభూత సత్తాస్ఫూర్తిరూపుడు, సచ్చిదానంద మనస్వరూపుడునగు బరమేశ్వరుని సృష్టికి మూలభూతమైన జ్ఞానమందనువిద్ధములగు శబ్దములే వైదికశబ్దములు. ఇట్టి స్థితి యందు సృష్టియంతయు నయిదారు వేల యబ్దములకు బూర్వ మందలిదని భావించుట వట్టిభ్రమ యని సిద్ధమగుచున్నది. బీజమునకు పూర్వ మంకురము, నంకురమునకు బూర్వము బీజమునని భావించబడుచున్నట్లే మఱియు బీజాంకురపరంపర యనాదియని యూహింపబడుచున్నటులే నిద్రకు బూర్వము జాగరణము, జాగరణమునకు బూర్వము నిద్ర యనియు, జన్మకు బూర్వము మరణము, మరణమునకు బూర్వము జన్మము ననియు, సృష్టికి బూర్వము ప్రలయము, ప్రలయము నకు బూర్వము సృష్టియనియు భావించవలసి వచ్చుచున్నది. కర్మకు ముందు జన్మ, జన్మకుముందు కర్మయని యూహింప వలసివచ్చుచున్నది. కర్మ రూపకారణ వైచిత్య్రము లేనిదే జన్మ రూపకారణవైచిత్య్రము సిద్ధింపజాలదు. ఈవిధముగా నిద్రాజాగరణ, జన్మమరణ, సృష్టిప్రలయ, జన్మకర్మాధిక మంతయు న నాదియని యంగీకరింపవలసి వచ్చుచున్నది. .