పుట:హాస్యవల్లరి.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212

డంగూరావుగారు ఒక సైన్యంలో జేరడానికి వెళ్ళి, అక్కడ పెద్దసేనానితో మాట్లాడుతూండగా,

సే - అనుభవం ఏమన్నా సంపాదించావూ?

డం - చిత్తం.

సే - సరే. నీకు సేన ఉందీ అనుకో.

డం - నిజంగానేకదండీ! సరే.

సే - నాలుగు వేపుల్నించీ శత్రుసేనలొచ్చి పడుతున్నాయీ అనుకో. నీపై సుబేదారు దాక్షిణ్యం అంటాడనుకో, మీ సేనలు ఉత్తరం అంటారనుకో, నీకు తూర్పు మోహంగా తిరగాలని ఉందీ అనుకో.

డం - నే అనుకోనండి.

సే - కబడ్దార్! అనుకో! అప్పుడేం జేస్తావ్?

డం - చిత్తం! రాజీనామా దాఖలుచేస్తాను.

213

వెంకటానందం - మరిటా, ఒక ఆసామీటా, జైలు తణికీ చెయ్యటానికి ఇట్టేవెళ్లి, ఓ అరగంటలో బయటికి రావాలనుకున్నాట్ట.

కోదండం - అనుకుంటే?

వెం - పాపం ఆర్నెల్లు ఆలస్యం అయిపోయిందిట.

కో - అంతాలస్య మెందుకైందో?

వెం - వాడు వెళ్ళిన దారి వలన వచ్చిందీ ప్రమాదం

కో - ఏం?

వెం - సింహద్వారం అంట వెడితే తీరిపోనా! కన్నంలోంచి వెళ్ళాట!

214

బుచ్చన్న - రాంగారు! మాఆవిడబొమ్మ పూర్తిచేశారూ?

రా - అయిందండి, రేపిస్తా.

బు - రంగులు ఏం ఉపయోగించారు?

రాం - చీరకి పసుపూ, రైకకి ఊదా వేశా.

బు - చీ చీ. కారపురంగు చీరా మిరియపురంగు రవికా ఉండాలి.

రాం - ఏమిటండీ, తెలియకుండా మాట్లాడతారూ?

బు - తెలియకపోవడమా! ఆకారానికీ తత్వానికీ ఆమాత్రమేనా సంబంధం లేకపోతే మా ఆవిడ బొమ్మే అనిపించదూ!

చాలుగానీ, ఈపాటి రంగు ఫిరాయించండి.

215

మొగభార్య - నాతో ఎవేనా మాటలు తగులడాలీ అంటే, ఒంటరిగా ఉన్నప్పుడు తగులడక, నలుగురూ వచ్చినప్పుడు తగులడతారేం? మీతగులడ్డం మండిపోతే!

ఆడంగిభర్త - సాక్ష్యానికి మనుషులు లేందే నీతో మాట్లాడ్డం ప్రమాదకరం అని లోగడ గ్రహించాగా!

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

47

హాస్యవల్లరి