పుట:హాస్యవల్లరి.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హ - అప్పుడూ మరోటి ఏదోరావచ్చు.

సు - మరోటి ఏదో రాకుండా ఉంటేమాటే!

హ - ఏమో! వెధవ యక్షప్రశ్నలు. ఇదివరకెప్పుడూ ఏదోవోటి వస్తూనే ఉంది.

209

“పుట్‌బాల్” ఆటలో మధ్యవర్తిగా పనిచేస్తూన్న బ్రహ్మయ్యగారిని ప్రేక్షకుల్లో ఒకకుర్రవాడు రాయిపుచ్చుగుని చచ్చేటట్టు వెయ్యగా, బ్రహ్మయ్య, పక్కనున్న ఒక పెద్దమనిషిని సంబోధించి,

బ్ర - చూశారండీ, సార్, ఈ కుర్రపిశాచం గాడు నా మొహం మీద ఎంతగాయం చేశాడో?

పె - (ఆయన్ని సమదాయిస్తూ) తొందరపడకండి, బాబూ ఆ పిల్లకాయకి బంతిఆట రూల్సు తెలియవేమో, కర్మదశా!

210

నరసింహమూర్తి, తనకి కొత్తగా పరిచితుడైన సత్యనారాయణ ఇంట్లో భోజనం చేస్తూ, కొంత అర్థంలేని సంభాషణ చేసిచేసి,

న - ఏమండీ! మీ “వైఫ్” గారు చాల “బ్యూటిఫుల్” గా ఉంటారండి, ఏముటో అనుకున్నానూ!

స - అందుకనేనండి మిమ్మల్ని మీబోట్లనీ పిలుస్తూంటాను నాయింటికి,

న - ఏం?

స - అనుమానం అనేది నా మనస్సులో జనించడం అసంభవం అవడానికి.

211

మగపెళ్ళివారి తాలూకు లక్ష్మణరావు, విడిదిలో భోగంమేళం మేజువాణీ జరుగుతూన్న సందర్భంలో పెళ్ళివారింటికి పరిగెట్టి అక్కడ తన స్నేహితుడైన కామప్పతో,

ల - కామప్పగారూ! మేళానికి రావాలి మహజోరుగా ఉంది.

కా - నన్ను చంపకు, ఎందుకొచ్చిన మేళం!

ల - పోనీ వాళ్ళతో ఒక్కమాటచెప్పి చక్కావస్తురుగాని!

కా - ఏమోబాబూ! నేను మళ్ళీ మళ్ళీ నాలిక ఇస్త్రీ చేయించు గోలేను.

ల - అదేంకర్మం !

కా - అప్పటితో వాక్సుద్దిపోతుంది, మరి.

ల - పోనీ వాళ్ళ గాంధర్వం విని చక్కావద్దురుగాని!

కా - ఏమోబాబూ! నేను మళ్ళీమళ్ళీ చెవులు కళాయి చేయించుగోలేను.

ల - అదేంకర్మం ?

కా - అప్పటితో శ్రుతిజ్జానం చేస్తుంది, మరి.

ల - పోని వాళ్ళనిచూసి చక్కారావయ్యా!

కా - ఏమోబాబూ! నేను మళ్ళీమళ్ళీ కళ్ళు మెరుగు పెట్టించుగోలేను.

ల - అదేం గ్రహచారం?

కా - అప్పటితో స్త్రీవాంఛ హరాయించిపోతేనూ!

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

46

హాస్యవల్లరి