పుట:హాస్యవల్లరి.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పసిడిసాహితి స్రష్ట హాస్యబ్రహ్మ

ఆధునిక, అత్యంతాధునిక సాహితీవేత్తల రచనలను నేటితరం పాఠకులకందించే ఆశయం విశాలాంధ్ర ప్రచురణాలయంది. ప్రగతిశీల దృక్పధాన్నీ, శాస్త్రీయ ఆలోచనా విధానాన్నీ తమ రచనల ద్వారా - ఏమాత్రం – అందించే కృషి చేసిన రచయితలనైనా వెతికి ప్రజల ముందుంచాం. గురజాడ నుండి ఇప్పటి వరకూ మా రచయితలు వీరే! మా సంస్థకు పలుకుబడి వీరి రచనలే! పెట్టుబడి - అభ్యుదయ సాహిత్యాన్ని అన్నివేళలా ఆదరించే తత్వమున్న పాఠకులే!

హాస్యం ఆరోగ్యవర్ధకం. ఆరోగ్య భావ సంవర్ధకం. దీన్ని గమనించే....సామాజిక సమస్యలనూ - రాజకీయ అవకతవకలనూ, చాలా సీరియస్ విషయాలనూ కూడా హాస్యంలో రంగరించి గత శతాబ్దం - 3, 4 దశాబ్దాలలో తెలుగువాళ్ళ మెదళ్ళ కుదుళ్ళను కదలించాడు. నవ్వీ నవ్వీ కన్నీళ్ళొచ్చే పర్యంతం తన రచనలను చదివించాడు. తెలుగు జన హృదయ పీఠంలో “హస్యబ్రహ్మ'గా కీర్తిశేషుడయ్యాడు - భమిడిపాటి కామేశ్వర్రావు (1897 - 1958). విదేశీ నాటకాల మెలకువలనూ, హాస్య రసగుళికలనూ గోదావరీ తీర భాషలో ముంచి తెలుగు తల్లి కందిచ్చాడు. స్కెచ్, నవల, నాటకం, హాస్యంతునకలు, లఘు వ్యాసాలు, విమర్శ ఏవైనా - భమిడిపాటి ముద్రతో భాసించాయి.

తాము సీరియస్‌గా ఉంటూ - అలాంటి అతి సీరియస్ విషయాల అధ్యాపనంలో ఉంటూ - పాఠకుల పొట్టచెక్కలేసిన తెలుగు రచయితలు మునిమాణిక్యం - భమిడిపాటి. మిఠాయి దుకాణంవాడు దాన్ని అమ్ముతాడే కానీ తింటూ ఉండడుగా!

ఈ తరం వాళ్ళకు భమిడిపాటి వారి రచనలు చాలా వరకు తెలీవనచ్చు. అందుకే వారి రచనలను ప్రస్తుతం ఏడు సంపుటాలుగా మన పాఠకులకందించాలన్న పథకం రూపొందించాం. ఇటీవల కన్నుమూసిన వారి కుమారుడు, ప్రసిద్ధ నాటక రచయిత భమిడిపాటి రాధాకృష్ణగారు ఈ ప్రచురణల రూపకల్పనలో చివరి వరకూ మాకు తోడ్పడ్డారు. వారికీ, వారి కుటుంబ సభ్యులకూ మా కృతజ్ఞతలు. ప్రస్తుతం వెలువడుతున్న మొదటి సంపుటంలో “కాలక్షేపం - గుసగుస పెళ్ళి” ఉన్నాయి. క్రమంగా మిగిలినవీ ప్రచురితమవుతాయి. దీనికి ముందు మాట రాసిన ప్రసిద్ధ కవి, పత్రికా సంపాదకులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్‌శర్మగారికి మా ధన్యవాదాలు.

ఈ పథకంలో వెలువడే సంపుటాలను ఎప్పటిలాగే పాఠకులు ఆదరిస్తారని అశిస్తూ....

ఏటుకూరి ప్రసాద్
సంపాదకుడు.
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్

నవంబర్, 2008.


మనవి : భమిడిపాటి కామేశ్వరరావు - "ఈసఫ్ కథలు, చెప్పలేం, చంద్రుడికి, స్వరాజ్యం, నిజం కూడా అబద్దమే" రచనలు మాకు లభించలేదు. భమిడిపాటి కామేశ్వరరావుగారి మిత్రులు, అభిమానులు వారి వద్ద వుంటే పంపి సహకరించ ప్రార్థన. - ప్రకాశకులు.

iii