పుట:హాస్యవల్లరి.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హాస్యబ్రహ్మాస్త్రాలు

హాస్యానికీ, కవిత్వానికీ కూడా మాచెడ్డ ప్రమాదకరమైన పోలిక ఒకటుంది. పోడిమిచెడితే, పచ్చిసరుకులాగ వినియోగపడకుండా పోతుంది. అంతేకాదు; రచయిత సమకూర్చిన నేపథ్యం దాటుకుని - కాలం గడిచినా - నవకం చెడకుండా తరం నించి తరానికి బతకాలంటే, కేవల 'కాలిక' ఘటనలకే పరిమితం కాకుండా, మనిషిలోని అంతః కరణను శోధించగలగాలి. అదీ అసలు సంగతి!

తెలుగులో హాస్యం ప్రాచీనత గురించి వృధా చర్చలెందుకుగాని - కచ్చితంగా ఒక సంగతి మాత్రం నిజం. వీరేశలింగంగారి 'ప్రహసనాలు', చిలకమర్తివారి 'వినోదములు' గడిచి - హాస్యం సున్నితమైన మెళుకువలు అలవరచుకున్నది, ఆధునిక యుగంలో 1920 ల దశ నుంచే - మరీ ముఖ్యంగా ఈ పనికి తమ రచనా వ్యాసంగాన్ని మీదుకట్టుకున్న త్రయం - మొక్కపాటి నరసింహశాస్త్రి, మునిమాణిక్యం నరసింహారావు, భమిడిపాటి కామేశ్వరరావు.

భమిడిపాటివారు నిఖార్సయిన లెక్కల మేష్టారుగా జీవితం గడిపినవారు. సిసలైన గోదావరి జిల్లా మనిషి. హాస్యత్రయంలో మిగిలిన ఇద్దరి తీరువేరు. కామేశ్వరరావుగారి మార్గంవేరు. ఈయన తెలుగువాళ్ల మనస్తత్వంలోని రకరకాల ఛాయల్ని కాచివడబోసిన మనిషి.

కుళ్లుకునే గుణం, అనవసర దర్పం, అసహనం, కోతలు కొయ్యడం, ఉడుక్కోవడం, అతి తెలివి ప్రదర్శించడం, పని జరుపుకొనిపోవడానికి అబద్దాలల్లడం, అరుదైన అమాయకత్వం, ఆడవాళ్లలో కొందరి 'రాలుగాయి'తనం... వంటి గుణగణాల్ని మహ బాగా పట్టుకుని - ఛలోక్తులు చెప్పారు. కథలు కట్టారు వ్యాసాలుపన్యసించారు. నాటకాలు, నాటికలు నిర్వచించారు.

భమిడిపాటివారు రాసిన నాటకాలలో చాలా భాగం మోలియర్ రచనలకు అనుసరణలో, అనువాదాలో కావడం విశేషం. తేడా ఏమంటే; ఒకవేళ ఇతివృత్తం పరాయి నేలలో పుట్టిందనుకున్నా, తెలుగు వాతావరణంలోకి పొదగడం! - ఆయన రచనా స్వభావంలోనే ఒక 'సంభాషణా స్వభావం' వుంది. కథనం చేసే పద్ధతిలో, పరమ వ్యవహార భాషా వాక్య నిర్మాణం వుంది.

కామేశ్వరరావుగారి హాస్వంలో మోటుదనం వుందనుకునే వాళ్లున్నారు. వారికి సమాధానం ఒకటే. ఆ మోటుదనం పాత్రలది. మాటల్లో పెళుసు, లీగల్ పాయింట్లు వెదికే బుద్ధి. వీపుమీద చరిచినట్టు, సొంటి పిక్క పెట్టినట్టు, మొట్టికాయ ప్రసాదించినట్టు, వేపబెత్తం ఝళిపించినట్టు, ఆయనవాడే భాష, కొందరికి నొప్పిగా అనిపించవచ్చు. ఇది మిరపకాయ బజ్జీ తినడంలో మమకారం మాదిరి అనుకుంటే తీరిపోతుంది - క్లుప్తంగా ఎంచి చెపితే, భమిడిపాటివారి హాస్యంలో వెటకారం, వ్యంగ్యం, తూష్ణీంభావం ప్రధానమైన కలుపుడు దినుసులు.

పాఠకులు ప్రధానంగా గుర్తించవలసినది : ఆయన హాస్యమంతా గోదావరి జిల్లాల్లో ఆయన కాలంనాటి మనుషుల తీరు నుంచీ, అక్కడి శుద్ద మాండలికం నుంచీ పుట్టింది. అంటే; దానికొక ఆవరణం, కాలం, వున్నాయి. ఈ గుర్తింపు ఈ తరహా హాస్యం ఆస్వాదించడానికి తొలిమెట్టు.

iv