పుట:హాస్యవల్లరి.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తం - ఏమీ ససిగా లేడంటారా?

మే - ఎల్లా ఉంటాడూ? మరో మార్కు ఎక్కువైందిప్పుడు.

తం - ఎక్కువవడం మంచిదే కాదుటయ్యా?

మే - అయితే నన్నెందుకు మీరడగడం?

తం - అదికాదండీ! రొండోయేడు దుఖ్ఖంతో చదవాలిగా!

మే - అంతా దుఖ్ఖిస్తారాండీ! ఒక్కొక్క రొండోపెళ్ళివాడు దుఖ్ఖిస్తూనే బాణాసంచాకూడా కాలిపిస్తాడు.

తం - ఎల్లా అయినాసరే పైకి వెళ్ళేట్టు చూద్దురూ!

మే - మీరతడు పడిపోకుండా చూసుగుందురూ?

175

ఒకావిడ భరతనాట్యం మొదలెట్టి, ఒకపదం పడుతూ, అందులోవచ్చిన 'నెరజాణ' అనే ముక్కలోది 'జాన' అనుకుని, చేతో జేన అభినయించగా,

ఒక సభ్యుడు - ఆహాహా! ఏమికళ, ఏమికళ!

పక్కవాడు - (నవ్వుతూ) ఏం, ఏం?

ఒ - ఆవిడ, కేవలమున్నూ, ఆయొక్క శబ్దబ్రహ్మం!

ప - చాల్లే ఊరుకో. అర్థబ్రహ్మం.

ఒ - ఎల్లా?

ప - ఎల్లానంటావా? ఎవరు సొమ్ము చేసుగుంటారో, వాళ్ళు అర్ధం చేసుగున్నవాళ్లు కాకుండా ఎల్లాపోతారూ?

176

రంగం - సోములూ! “ఊటీ” వెళ్ళి వచ్చావుట.

సో - అవును.

రం - నీకు చాదస్తంగాని, చలవ ఇక్కడమాత్రం లేదూ ? అయితే, యేటా వెడుతున్నావా?

సో - రొండోమాటు ఇది.

రం - అయ్యో, సొమ్ము తగులడిపోతుంది. ఇహ చాల్లే. వెళ్ళకు.

సో - మొదటిసారి వెళ్ళొచ్చి అల్లానే అనుకున్నాను. అనుకుంటూండగానే, మళ్ళీ కరిచింది పిచ్చికుక్క, మరి కరవకపోతే, మరి వెళ్ళను.

177

తనబంధువు ఆసుపత్రిలో ఆపరేషను చేయించుగోడంగురించి కబురంపగా, ఒకాయన ఆసుపత్రికివెళ్ళి దిక్కుమాలిన అనవసరపు గొడవలతో ఆ బంధువుని సకలబాధా పెట్టగా, వీణ్ణి ఎరక్కపోయి రమ్మంటినిగదా అని అతడు లోలోపల కుసిళ్ళుతూండగా,

ఆయన - పాపం! నువ్వు ఒంటరిగా ఉంటూండడంవల్ల తోస్తూండదు గావును!

బంధువు - తోచకేం? నన్ను చూడడానికి నీ బోటిగాడు నాకు ప్రతీరోజూ ఎక్కడ లభిస్తాడూ?

178

ముత్తయ్య తను తలంటుగోడానికి ఒక వడ్డీమంగలికి కబురంపగా, వాడువచ్చి, ఆయన్ని పరకాయించి, తన రుమాలు తీసి తలకి వాసిన చుట్టినట్టు చుట్టుకోగా,

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

117

హాస్యవల్లరి