పుట:హరివంశము.pdf/551

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 10.

503

సీ. కవిసి నీహారంబుఁ గదియింప నొడళులు ముడిఁగియు డస్సియు మూర్ఛిలియును
     హయవారణస్యందనావలిపై నుండలేక యారోహకు ల్పృథివిఁ గూల
     నెక్కడెక్కడఁబోయె నక్కడె యెల్లను దావాగ్ని త్రొక్కినదావభూమి
     క్రమమునఁ బొడివొడిగాఁ గాలమృత్యువుఁ జూచిన ట్లసురలు చూచి తలరఁ
తే. బ్రళయసమయంబునం దుగ్రభంగి జీవ, పశుగణంబుల సమయించు పశుపతియునుఁ
     బోలె నాభీలదుస్సహలీల యెసఁగఁ, జల్లఁజంపయ్యెఁ జంద్రుఁడు శత్రుతతికి. 94
వ. అట్టియేడ రెండుసేనలయందును నుదటు గల సోటరు లామనికాలంబు మేపు
     క్రొవ్వున మందలయందఁ గడంగి నలిరేఁగి తొడంగు వృషభంబులుం బోలె దర్పించి
     తలపడిన నధికసంకులం బయ్యె నందుఁ బలువురమీఁద నొక్కరుండును నొక్కని
     మీఁదం బలువురును బలువురు పలువురమీఁదనుం గవిసి పోట్లాడ నన్యోన్య
     శస్త్రపాతంబులవలన నంగకంకటంబులు చినింగియు శిరస్త్రాణంబు లెడలియుఁ బరిక్ష
     తాంగులగువారును రథ్యంబులు మడిసియు సారథులు వడియును విరథులై వెడంగు
     పడువారును విండ్లు విఱిగియు ఖడ్గాదిసాధనంబులు సమసియుఁ జేయునది లేక
     చేడ్వడు వారునుఁ గాలుసేయుఁ దునిసియు నవయవంబులు వ్రస్సియుఁ ద్యక్తజీవితు
     లగువారును నానాభూషణస్థానంబులం బ్రదీప్తబాణంబులు గాఁడి చందనోత్క్షిత
     వక్షంబులు మేదోమాంసవసావిసరంబుల బ్రుంగి హసితోల్లసితవదనంబుల బహుళ
     రుధిరంబులు గ్రక్కి కూలియు లీలావికాసంబున భాసిల్లువారు నగుచు నార్పులుఁ
     బెడబొబ్బలుం దూర్యరవంబులుఁ దర్జనంబులుఁ బొగడ్తలు నెసంగఁ గోలా
     హలమయంబు లగు చోట్లును దూళిబ్రుంగి మడంగి మ్రగ్గి మడిసి యులివు
     లడఁగి పాడువాఱు ప్రదేశంబులును గరినరతురగకళేబరంబులుఁ గరాళంబు లయి
     కీలాలంబులు కాలువ లై మాంసకర్దమంబుల దుర్గమంబు లై దుర్దర్శనంబు లగు
     నెడలు నై మహారణంబు ప్రవర్తిల్లుచుండ.95
క. ఉరవడి విష్వక్సేనుని, యురస్థలమునందుఁ జొనిపె నొకశరము రిపూ
     త్కరతిమిరవిరోచనుఁ డగు, విరోచనుఁడు దానఁ గనలి విబుధోత్తముఁడున్.96
తే. నవశరంబుల నొంచె దానవుని దేహ, మాతఁ డాజ్యాహుతులఁ బేర్చునధ్వరాగ్ని
     పగిది నుద్దీప్తుఁడయి యేడుబాణముల వి, రోధిపర్వమర్మంబులు గ్రుచ్చుటయును.97
క. సాధ్యుఁడు మూర్ఛమునింగి రథ, మధ్యంబున వ్రాలి వేగమ ప్రబుద్ధుండై
     యధ్యారూఢసముద్యమ, సిధ్యద్బలుఁ డగుచు నేసె శీతవిశిఖంబుల్.98
ఉ. ఆతనిచెయ్ది గైకొనక యయ్యసురేంద్రుఁడు తద్బలంబుపై
     నాతతకార్ముకధ్వనిత మష్టదిగంతవిభేదిగా శర
     వ్రాతము నించుచుం గడఁగి వారణఘోటరథస్థమస్తముల్
     భూతల మంతయుం దఱచుప్రోవులు చేసే భయంకరోద్ధతిన్.99